: జీఎస్టీపై కేంద్రం మెట్టు దిగడంతో 52 వారాల గరిష్ఠానికి దూసుకెళ్లిన నిఫ్టీ... రూ. 68 వేల కోట్లకు పైగా పెరిగిన మార్కెట్ కాప్

ఎంతోకాలంగా పెండింగులో ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్రం ఓ మెట్టు దిగడంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ గణనీయంగా పెరగడంతో నిఫ్టీ సూచిక 52 వారాల తాజా గరిష్ఠానికి చేరుకుంది. ఎన్నో రాష్ట్రాలు విభేదిస్తున్న ఒక శాతం అదనపు పన్నును వెనక్కు తీసుకోవడంతో పాటు, రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని ఐదేళ్ల పాటు 100 శాతం భర్తీ చేసేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 100 పాయింట్లకు పైగా లాభంలో నిలిచిన సెన్సెక్స్, చివరి అరగంట వ్యవధిలో ఒక్కసారిగా హైజంప్ చేసింది. దీంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 68 వేల కోట్లు పెరిగింది. మిడ్, స్మాల్ క్యాప్ సెక్టార్లు సైతం బెంచ్ మార్క్ ఇండెక్స్ లతో సమానంగా లాభాలను అందుకున్నాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 184.29 పాయింట్లు పెరిగి 0.66 శాతం లాభంతో 28,208.62 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 50.50 పాయింట్లు పెరిగి 0.59 శాతం లాభంతో 8,666.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.62 శాతం, స్మాల్ కాప్ 0.60 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 24 కంపెనీలు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, ఇన్ ఫ్రాటెల్, మారుతి సుజుకి, ఐచర్ మోటార్స్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అరవిందో ఫార్మా, ఐడియా సెల్యులార్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,877 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,487 కంపెనీలు లాభాలను, 1,163 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 1,07,96,205 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,08,64,446 కోట్లకు పెరిగింది.

More Telugu News