: అక్కడ తుపాకులు డెడ్ చీప్... 67 వేల రూపాయల 'స్వాట్' వెపన్ జస్ట్ ఏడువేలే!

పాకిస్థాన్ లోని పెషావర్ కు దక్షిణాన ఉన్న దర్రా అదమ్‌ ఖేల్‌ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరకు మంచి తుపాకీ కొనుగోలు చేయవచ్చు. తీవ్రవాదులకు తుపాకులు అంత చవగ్గా ఎలా లభిస్తాయన్న ప్రశ్నలకు చాలా సమాధానాలు దర్రా అదమ్ ఖేల్ లో దొరుకుతాయి. 35 కిలోమీటర్ల మేర కొండలు విస్తరించి వున్న ఈ ప్రాంతం పాక్ లోని నేరాలకు అడ్డాగా పేరొందింది. స్మగుల్డ్‌ గూడ్స్, మాదకద్రవ్యాలు, దొంగిలించిన కార్లు, నకిలీ డిగ్రీలు... ఒకటేమిటి, అక్రమం ఏదైనా ఇక్కడ సక్రమమే. 1980ల్లో సోవియట్‌ యూనియన్‌ కు వ్యతిరేకంగా ముజాహిదీన్‌ లు యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయుధాలు కొనుగోలు చేసేవారు. తర్వాత ఈ ప్రాంతం పాక్‌ తాలిబన్లకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ వారు సమాంతరపాలన ప్రారంభించారు. అయితే 2009లో పోలాండ్‌ కు చెందిన ఇంజినీర్‌ ను కిడ్నాప్ చేసి, ఇక్కడే దాచడంతో ఆ ప్రాంతం గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ సుమారు 7000 ఆయుధ విక్రయ దుకాణాలు ఉండేవి. అసలు ప్రతి రెండు షాపుల్లో ఒకటి ఆయుధ విక్రయ దుకాణమేనంటే ఆశ్చర్యం కలగక మానదు. మన బజార్లలో కూరగాయలు అమ్మినట్టు ఇక్కడ ఆయుధాలు అమ్ముతారు. నడిరోడ్డుపై క్రయవిక్రయాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరి వెంట ఆయుధం వుండడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ తుపాకుల తయారీ కుటీర పరిశ్రమలా తయారైంది. అందుకు అవసరమైన వర్క్‌ షాప్‌ లు, ఉద్యోగులు, జనరేటర్లు ఎక్కడికక్కడ కనిపిస్తాయి. కరాచీ షిప్‌ యార్డ్‌ లో నుంచి ఆయుధాలకు సంబంధించిన లోహాన్ని కొనుగోలుచేసి, అక్కడే దానిని తమకు కావాల్సిన ఆకారంలో మలుచుకొని తెచ్చుకుంటారు. ఆ తరువాత ఆయుధాన్ని తయారు చేసి, వీధుల్లో విక్రయిస్తారు. ఇక్కడ టెస్ట్‌ ఫైరింగ్ ఫెసిలిటీ కూడా ఉండడం విశేషం. ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తులు చేసే టెస్ట్ ఫైర్ లతో ఈ ప్రాంతం మోతెక్కిపోతుంది. అమెరికాలో స్వాట్‌ (స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌) బృందాలు వాడే తుపాకుల ధర అమెరికా మార్కెట్లో 1000 డాలర్ల వరకు ఉండగా, ఇక్కడ మాత్రం దాని నకలు తుపాకీ కేవలం 7,000 రూపాయలకు లభిస్తుందంటే అక్కడ ఈ వ్యాపారం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా తయారైన తుపాకులకు ఏడాది గ్యారంటీ ఇవ్వడం మరో విశేషం. ఏకే-47 నకిలీలని కేవలం 125 డాలర్లకు విక్రయిస్తారు. ఇక్కడి ఆయుధ వ్యాపారులు తయారు చేయని తుపాకులు అంటూ లేవంటే ఆశ్చర్యపోకతప్పదు. ఒక వ్యాపారి పదేళ్లలో సుమారు 10,000కు పైగా తుపాకులు అమ్మాడంటే ఇక్కడ ఆయుధ పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందనే చెప్పచ్చు!

More Telugu News