: 19వ బిడ్డకు జన్మనిచ్చిన దంపతులు.. వారిని పోషించడానికి ఏడాదికి రూ.26.56 లక్షల ఖర్చు

వారిది బ్రిటన్‌లోనే అతి పెద్ద కుటుంబం. కానీ వారి కుటుంబంలో తాత‌లు, అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ‌లు, బాబాయిలు లాంటి వారెవ‌రూ ఉండ‌రు. ఓ జంట, వారి పిల్ల‌లు మాత్ర‌మే ఉంటారు. అయినా బ్రిట‌న్‌లోనే అతిపెద్ద కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఎలా అంటే, స్యూ రాడ్‌ఫోర్డ్‌-నియోల్ దంప‌తులు ఇప్ప‌టికే 18 మంది పిల్ల‌ల్ని క‌న్నారు. తాజాగా 19వ బిడ్డ‌కి జ‌న్మినిచ్చారు. స్యూ రాడ్‌ఫోర్డ్‌ (41) ఇటీవ‌లే జ‌న్మ‌నిచ్చిన ఆ ఆడబిడ్డకు ఫొయెబె విల్లో అని పేరు పెట్టారు. గ‌త ఏడాది తాము 18 వ బిడ్డ‌కు జ‌న్మినివ్వ‌గానే పిల్లల్ని కనడం మానేయాలని అనుకున్నామ‌ని, అయితే 20 మంది పిల్ల‌ల్ని క‌న్నాక ఆ ప‌ని చేయాల‌ని మ‌ళ్లీ ఆలోచించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వారు తెలిపారు. మరి ఈ 19 మంది పిల్ల‌ల్ని పోషించ‌డానికి వీరికెంత ఖ‌ర్చ‌వుతోందో తెలుసా? ఏడాదికి అక్ష‌రాలా రూ. 26.56 లక్షలు. వీరికి ఓ సొంత బేకరీ ఉంది. ఈ వ్యాపారాన్ని చేసుకుంటూ నియోల్‌ దంపతులు పిల్ల‌ల్ని పెంచి పెద్ద‌వాళ్ల‌ను చేస్తున్నారు. రాడ్‌ఫోర్డ్‌ 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తొలిసారి గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె వ‌య‌సు 41 సంవ‌త్స‌రాలు. తొలిసారి కాన్పు అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పిల్లలు పుట్ట‌కుండా ఆప‌రేష‌న్ చేయించుకోనే లేదు. తమ పిల్లల సంఖ్య 20 ఉంటే బాగుంటుందని బంధుమిత్రులు సూచిస్తున్నార‌ని, 20వ బిడ్డ‌ను కంటామ‌ని ఈ దంప‌తులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. రాడ్‌ఫోర్డ్‌-నియోల్‌ దంపతుల పెద్ద కొడుకు పేరు క్రిస్‌. అతనికిప్పుడు 27 సంవ‌త్స‌రాలు. ఆ త‌రువాత వారు క‌న్న పిల్ల‌ల పేర్లు వ‌ర‌స‌గా సోఫీ, క్లోయి, జాక్‌, డానియెల్‌, ల్యూక్‌, మిల్లీ, కేటీ , జేమ్స్‌, ఎల్లీ, ఐమీ, జోష్‌, మాక్స్‌, టిల్లీ, ఆస్కార్‌, కాస్పర్‌, హల్లీ. వీరికి ఎల్ఫీ అనే మ‌రో ఆడబిడ్డ కూడా ఉండేది అయితే, ఆ పాప పుట్టిన‌ 21 వారాల వయస్సులో మ‌ర‌ణించింది. అందుకే, ఫొబెను 19వ బిడ్డగా వారు భావిస్తున్నారు.

More Telugu News