: దేశాన్ని సుర‌క్షిత‌మైన చేతుల్లో పెడుతున్నా: బరాక్ ఒబామా

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్న హిల్ల‌రీ క్లింట‌న్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య‌ మిషెల్లీ ఒబామా ఇటీవ‌లే ప్రసంగం చేసిన సంగ‌తి విదిత‌మే. తాజాగా బరాక్ ఒబామా కూడా క్లింట‌న్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన డెమొక్ర‌టిక్ పార్టీ స‌మావేశంలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమెరికాని సుర‌క్షిత‌మైన చేతుల్లో పెడుతున్నానని వ్యాఖ్యానించారు. హిల్ల‌రీ క్లింటన్‌ ఒక‌ పోరాట యోధురాల‌ని, అంతేగాక‌ ఆమెకు రాజ‌నీతి తెలుసని ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. హిల్ల‌రీ క్లింటన్‌ ఓ త‌ల్లి, అమ్మ‌మ్మ, సంఘ‌సేవ చేసే వ్య‌క్తి, దేశభ‌క్తి ఉన్న మ‌హిళ అని ఆయ‌న అన్నారు. త‌న‌ని అమెరికా అధ్య‌క్షుడిగా దేశానికి అవ‌స‌ర‌మ‌యిన‌ప్పుడు ఎన్నుకున్నార‌ని, అలాగే హిల్ల‌రీ క్లింట‌న్‌ని ఎన్నుకోవాల‌ని ఒబామా ప్ర‌జ‌ల‌కి సూచించారు. త‌న‌ని ప్ర‌జ‌లు ఎలా ఆదరించారో హిల్లరీని సైతం అలాగే ఆద‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ద్వేషాన్ని ఓట‌మిపాలు చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉత్త‌మ‌మ‌యిన వ్య‌క్తిని అధ్య‌క్షుడిగా ఎన్నుకోవాల‌ని ఆయ‌న అన్నారు. త‌న‌కు అమెరికా అధ్య‌క్షుడిగా రెండు సార్లు అవ‌కాశం ఇచ్చినందుకు ఒబామా ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల విలువ‌ల్ని విమ‌ర్శించే వారు ఫాసిస్టులైనా, క‌మ్యూనిస్టులైనా, జిహాదీలైనా, ప్ర‌జా కంఠ‌కులైనా ఓటమిని చవిచూడాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. హిల్ల‌రీలో అమెరికాను ఏలే తెగువ‌, ధైర్యం ఉన్నాయ‌ని ఒబామా వ్యాఖ్యానించారు. గ‌తంలో చీఫ్ క‌మాండ‌ర్‌గా హిల్ల‌రీ త‌న విధిని స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించార‌ని ఒబామా అన్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా ఆమెను మించిన అర్హులు ఎవ‌రూ లేర‌ని ఆయ‌న అన్నారు. ట్రంప్ కి ఆ అర్హ‌త లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ట్రంప్ చెప్పేవ‌న్ని వ‌ట్టిమాట‌లేన‌ని, జ‌నాల‌ను ఆయ‌న‌ భ‌య‌పెట్టిస్తున్నాడ‌ని, అమెరికా ప్ర‌జ‌ల‌ గొప్ప‌తనం ట్రంప్ మీద ఆధార‌ప‌డిలేద‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News