: 'ఇదుగో.. మా సత్తా' అంటూ ఖండాలను దాటే క్షిపణి వీడియోను విడుదల చేసిన చైనా

సౌత్ కొరియాలో 'థాడ్' యాంటీ మిసైల్ సిస్టమ్ ను అమెరికా మోహరించిన వేళ, తామేమీ తక్కువ కాదంటూ చైనా ఓ అధికారిక వీడియోను విడుదల చేసింది. ఖండాలను దాటి వెళ్లి లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని పరీక్షించి, తమ సత్తా చూడండంటూ దాని వీడియోను విడుదల చేసింది. దీన్ని ఆరేళ్ల క్రితమే తాము తయారు చేసుకున్నామని ప్రకటించింది. "మా వ్యూహాత్మక రక్షణ విధానంలో బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాం. శక్తిమంతమైన దేశాల నడుమ కొనసాగుతున్న ఆధిపత్య పోరులో మేమూ ఉన్నాం. ఈ తరహా వ్యవస్థ మా వద్ద ఉందంటే, అగ్రరాజ్యాల వైఖరిలో మా పట్ల కొంత తేడా వస్తుంది" అని పీఎల్ఏ రీసెర్చర్ చెన్ డెమింగ్ వ్యాఖ్యానించారు. ఈ క్షిపణి విజయవంతంతో దేశానికి రక్షణ దిశగా తమ శక్తి ఎలాంటిదో ప్రపంచానికి తెలిసి వస్తుందని డెమింగ్ వ్యాఖ్యానించినట్టు చైనా రేడియో ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2010, 2013లో సైతం ఈ తరహా క్షిపణులను చైనా పరీక్షించినప్పటికీ, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు.

More Telugu News