: 2000లో రూ. 5.60 లక్షల కోట్లు ఇస్తామంటే వద్దన్న యాహూ, నేడు రూ. 32 వేల కోట్లకు అమ్ముడైంది!

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే ఎంతగా నష్టపోవాల్సి వస్తుందన్న దానికి యాహూ ఓ మంచి ఉదాహరణగా భవిష్యత్ తరాల కళ్ల ముందు నిలిచింది. ఇతర సంస్థలు ప్రధానంగా గూగుల్ దూసుకెళుతున్న వేళ, అపారమైన ఆర్థిక వనరులుండి కూడా ముందడుగు వేయలేక చతికిలబడిన యాహూ ఇంటర్నెట్ కార్యకలాపాలను టెలికం సంస్థ వేరీజోన్ రూ. 32 వేల కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే యాహూ ఇంటర్నెట్ విలువ 2000 సంవత్సరంలో ఎంతో తెలుసా? 125 బిలియన్ డాలర్లు! అప్పట్లో డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 45కు అటూఇటుగా ఉండగా, ఆ రేటుపై లెక్కిస్తే, యాహూ విలువ రూ. 5.60 లక్షల కోట్లు. ఆ తరువాత ఎనిమిదేళ్లకు నెట్ ప్రపంచంలో దూసుకువచ్చిన మైక్రోసాఫ్ట్, 2008 సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.76 లక్షల కోట్లు - ఒక డాలర్ రూ. 40పై) ఇచ్చి యాహూను కొనేందుకు ముందుకు వచ్చినా, బోర్డు డైరెక్టర్లు ససేమిరా అన్నారు. మరో ఎనిమిదేళ్లు గడిచేసరికి యాహూ విలువ మరెన్నో రెట్లు పడిపోయింది. యాహూకు ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు. విలువ పతనం వెనుక సంస్థ చేసిన తప్పులెన్నో ఉన్నాయి. 1998లో గూగుల్ ను ప్రారంభించిన లారీ పేజ్, సెర్జి బ్రిన్ ను దాన్ని కొనుక్కోవాలని యాహూను సంప్రదిస్తే, నిర్లక్ష్యం చేసి తిరస్కరించారు. ఇది యాహూ తొలి తప్పు. ఆపై అదే గూగుల్ తో డీల్ కుదుర్చుకుని ఆ సంస్థ శరవేగంగా ఎదిగేందుకు సహకరించి, సమగ్రమైన సొంత సెర్చింజన్ ను తయారు చేసుకోలేకపోవడం రెండో తప్పు. ఇక 2000 తరువాత వచ్చిన డాట్ కాం బూమ్ ను ముందుగా అంచనా వేయలేకపోయిన యాహూ డైరెక్టర్లు, యాజమాన్యం ఆపై తేరుకొని ఫ్లిక్కర్, డెలిషియస్, అప్ కమింగ్, మై బ్లాగ్ లాగ్ వంటి స్టార్టప్ లను భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేయగా, అవి కలసిరాలేదు. మొత్తానికి తప్పు మీద తప్పు చేస్తూ వచ్చిన సంస్థ అందుకిప్పుడు తగిన మూల్యాన్నే చెల్లించుకుందన్నది నెట్ నిపుణుల అంచనా.

More Telugu News