: ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మేకప్ ఆర్టిస్ట్ జిల్ హర్త్

ట్రంప్ చేసిన లైంగికదాడిపై మేకప్ ఆర్టిస్ట్ జిల్ హర్త్ తన ఇరవై ఏళ్ల మౌనాన్ని వీడారు. న్యూయార్క్‌ లోని గార్డియన్ పత్రిక కార్యాలయంలో ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న తాను ఇప్పుడు ట్రంప్ పై మరోసారి మాట్లాడడం వెనుక కారణాన్ని వివరిస్తూ... 1997లో అత్యాచార యత్నం కింద ట్రంప్‌ పై తాను దాఖలు చేసిన కేసును ఓ మీడియా తవ్వితీసిందని, ఈ సందర్భంగా ట్రంప్ కుమార్తె తన తండ్రి చాలా మంచివాడని, అతను అలాంటి వ్యక్తి కాదని చెప్పడంతో... తన క్యారెక్టర్ ను కించపరుస్తుండడాన్ని తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చానని ఆమె తెలిపారు. ఎన్నో మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూల కోసం ఎగబడినా నోరు విప్పలేదని, ఇంకా మౌనం మంచిదికాదని భావించి ఆ నాటి విషయాలు పంచుకుంటున్నానని, ట్రంప్ లా తాను అబద్ధాల కోరును కాదని ఆమె తెలిపారు. అప్పటి విషయాలు వెల్లడిస్తూ...అప్పట్లో జరిగిన అందాల పోటీలో భాగంగా ఇచ్చిన విందులో ట్రంప్ తన ఎదురుగా కూర్చున్నారని ఆమె చెప్పారు. ఆ సమయంలో టేబుల్ కింద నుంచి తన శరీరాన్ని తడిమేందుకు ట్రంప్ పలు మార్లు ప్రయత్నించడంతో ఆ విందు నుంచి తాను అర్థాంతరంగా నిష్క్రమించానని ఆమె వెల్లడించారు. మరో సందర్భంలో ట్రంప్ తన నివాసంలోని చిన్న పిల్లల గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె చెప్పారు. పక్క గదిలోనే తన ఫియాన్సీ, ఇంకొందరు మిత్రులు ఉన్నప్పటికీ అతను తనపై లైంగిక దాడికి యత్నించాడని, ఆ రోజు అతనిని తప్పించుకునేందుకు యుద్ధమే చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ట్రంప్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత తనను ప్రేమిస్తున్నట్లు, తాను లేకుండా ఉండలేనంటూ ఫోన్లు చేసి విసిగించేవాడని, కుదరదని చెప్పినా వినిపించుకునేవాడు కాదని, తన ఫియాన్సితో కలిసి తాను చేపట్టిన ప్రాజెక్టుకు ఆయన స్పాన్సర్ కావడం వల్ల అతనిని పలు సందర్భాల్లో కలవాల్సి వచ్చిందని, దానిని ట్రంప్ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాడని. అతని వేధింపులు భరించలేకపోవడంతో న్యాయవాదిని సంప్రదించానని ఆమె తెలిపారు. దీంతో ట్రంప్ పై అత్యాచారయత్నం కేసు నమోదైందని ఆమె తెలిపారు. అలాంటి ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని, ఇకపై కూడా తనపై వేధింపుల పర్వం కొనసాగుతుందని అర్థమైందని మౌనాన్ని ఆశ్రయించానని ఆమె చెప్పారు. ట్రంప్ కూడా దీనిపై మౌనంగా ఉండి ఉంటే తాను నోరు విప్పేదానిని కాదని, ఇప్పుడు తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లడంతో మౌనాన్ని వీడక తప్పలేదని... సమాజం దృష్టిలో తాను పరువుతక్కువ దానిని అయిపోతున్నానని, ఈ ఆరోపణల వల్ల తన బిజినెస్ కూడా దెబ్బతిందని ఆమె చెప్పారు. అప్పుడైనా, ఇప్పుడైనా ట్రంప్ నుంచి తాను ఏమీ కోరుకోవడం లేదని... వేధింపులపై క్షమాపణలు చెబితే చాలని ఆమె తెలిపారు. దీనిపై తండ్రికి అనుకూలంగా ట్రంప్ కుమార్తె మాట్లాడడాన్ని తాను అర్థం చేసుకోగలనని, ఈ సంఘటన జరిగినప్పుడు ఆమెకు పదేళ్లు ఉంటాయని ఆమె తెలిపారు. ప్రతి కుమార్తె తన తండ్రిని గొప్పగానే ఊహించుకుంటుందని ఆమె తెలిపారు.

More Telugu News