: లొంగిపోయినట్టు చెబుతున్నా నల్లజాతీయుడి కాళ్లపై కాల్చిన అమెరికా పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో

అమెరికా పోలీసులు మరోమారు ఓ నల్లజాతీయుడిపై తుపాకితో విరుచుకుపడ్డారు. లొంగిపోయినట్టు చేతులు పైకెత్తి చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోని పోలీసులు అతడి కాలిపై కాల్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మొత్తం వీడియోలో కాల్పులు రికార్డు కాలేదు. నేలపై పడుకుని చేతులు పైకెత్తిన నల్లజాతీయుడు, అతడి కాళ్ల దగ్గర మరో వ్యక్తి ఉన్నారు. వారికి 15 అడుగుల దూరంలో ఇద్దరు పోలీసులు ఓ కరెంటు స్తంభం వద్ద నిల్చుని ఉన్నారు. టెలిఫోన్ పోల్ దగ్గర నిల్చున్న ఇద్దరు పోలీసులు ఒకరు తన కాలిపై మూడుసార్లు కాల్చినట్టు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న చార్లెస్ కిన్సే ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బుల్లెట్లు తగలగానే తన చేతులను పైకెత్తానని పేర్కొన్నారు. అయితే తన కాళ్ల వద్ద కూర్చున్న వ్యక్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. తనకు కొద్ది దూరంలోనే నిల్చున్న పోలీసులు ఎందుకు కాల్చారో కూడా అర్థం కావడం లేదన్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిన్సేను కాల్చిన పోలీసును ఇప్పటి వరకు అధికారులు గుర్తించలేదు. కిన్సే మాత్రం ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి అని పేర్కొన్నారు. కాల్పుల వెనక గల ఉద్దేశం ఏమిటో తెలియదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మియామీ పోలీసు అధికారులు తెలిపారు. కాగా మరో వీడియోలో కిన్సే సహా అతని కాళ్ల వద్ద కూర్చున్న వ్యక్తికి పోలీసులు బేడీలు వేసినట్టు ఉంది.

More Telugu News