: కబాలి...ప్రివ్యూ... ఓ ప్రేక్షకుని విశ్లేషణ!

'కబాలి' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వయసు మళ్లిన డాన్ పాత్రలో రజనీకాంత్ ఎలా ఉన్నాడు? పెద్దగా పేరు లేని దర్శకుడు రజనీని ఎలా చూపించాడు? తలైవా తనకు తగ్గ సినిమాను ఎంచుకున్నాడా? ఇలా ఎన్నో సందేహాల నడుమ 'కబాలి' సినిమా అమెరికాలో విడుదలైంది. దీనిని చూసిన బాలాజీ శ్రీనివాసన్ అనే వ్యక్తి సినిమాపై తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో రాసి సోషల్ మీడియాలో పెట్టాడు. అతని దృష్టి కోణం నుంచి 'కబాలి' రివ్యూ మీకోసం... సినిమా కథ మలేషియా నేపథ్యంలో నడుస్తుంది. మలేషియాలో అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు, వారి బారి నుంచి తమను రక్షించే వ్యక్తి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ వివక్షను ఎదిరించి జైలుపాలై విడుదలైన తలైవా అక్కడ సాధారణ మనిషిగా జీవిస్తాడు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా కుమార్తెను రక్షించుకునేందుకు గ్యాంగ్ స్టర్ గా మారతాడు. దీంతో అప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పక్షాన నిలబడి...వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాడు. టూకీగా ఇదీ 'కబాలి' కథ. ఈ సినిమా రజనీ కాంత్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. రజనీ తన మేనరిజమ్స్ తో అభిమానులను గిలిగింతలు పెడతాడని ఆయన పేర్కొన్నారు. రజనీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు పా రంజిత్ సినిమాను రూపొందించాడని ఆయన తెలిపారు. ఫ్లాష్ బ్యాక్ కూడా జొప్పించడంతో గత సినిమాల్లోలా అనిపించినప్పటికీ...రజనీ కాంత్ కుర్రాడిగా దూకుడుగా కనిపించి అభిమానులను అలరిస్తాడని ఆయన పేర్కొన్నారు. సినిమా నిడివి పెరిగినట్టు అనిపించినా తలైవా అభిమానులను మాత్రం అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News