: విడిపోయిన ల్యాంకో ఇన్ ఫ్రా, మూడు కొత్త సంస్థలు... అధిక వాటాలు బ్యాంకులకు!

పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయిన ల్యాంకో ఇన్ ఫ్రా, మూడుగా విడిపోయి, బ్యాంకులకు అధిక వాటాలను ఇవ్వడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న ల్యాంకో ఇన్ ఫ్రా, బ్యాంకులు ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ ప్రకారం, విద్యుత్ కేంద్రాలను ఓ సంస్థగా, ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ రంగాలను మరో అనుబంధ సంస్థగా, మిగిలిన వ్యాపారాలను మూడో సంస్థగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. విద్యుత్ వ్యాపారంలో బ్రిటన్ సంస్థ ఓపీజీ పవర్ వెంచర్స్ 51 శాతం కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా, అందుకు బ్యాంకుల ఫోరమ్ సైతం అంగీకరించింది. దీని విలువ రూ. 5 వేల కోట్ల వరకూ ఉంటుందని ల్యాంకోకు రుణాలిచ్చిన ఐసీఐసీఐ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు లెక్కగట్టాయి. ఇక మిగతా రుణాన్ని రాబట్టుకునే దిశగా ప్రయత్నిస్తున్న బ్యాంకులు దాదాపు రూ. 25 వేల కోట్లను విడిపోయే సంస్థల ఈక్విటీల రూపంలో స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాయి. సంస్థ విడిపోతుందన్న వార్తలపై స్పందిస్తూ, కొన్ని ఆస్తులను విక్రయించేందుకు చర్చిస్తున్నామని, వ్యూహాత్మక భాగస్వామి కోసం వెతుకుతున్నామని, గడచిన రెండు వారాల వ్యవధిలో బ్యాంకర్లతో రెండు దఫాలుగా సమావేశమయ్యామని పేర్కొంది. ఉడిపి విద్యుత్ ప్లాంటును రూ. 6 వేల కోట్లకు అదానీ పవర్ కు విక్రయించినట్టు తెలిపారు. 2018 నుంచి అప్పుల భారాన్ని పూర్తిగా తగ్గించుకుంటామని పేర్కొంది.

More Telugu News