: ఎఫ్ఐఐల మద్దతుతో ముందడుగు వేసిన స్టాక్ మార్కెట్

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో భారత స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 70 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగిన సూచికలు, మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. లార్జ్ క్యాప్ సెక్టార్ ఈక్విటీలతో పోలిస్తే, చిన్న, మధ్య తరహా కంపెనీల వాటాలను సొంతం చేసుకునేందుకు మదుపరులు పోటీ పడ్డారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు అర శాతం లాభపడ్డ వేళ, స్మాల్, మిడ్ క్యాప్ లు ఒక శాతం వరకూ పెరగడం గమనార్హం. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 128.27 పాయింట్లు పెరిగి 0.46 శాతం లాభంతో 27,915.89 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 37.30 పాయింట్లు పెరిగి 0.44 శాతం లాభంతో 8,565.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.90 శాతం, స్మాల్ కాప్ 0.99 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. అరవిందో ఫార్మా, టాటా పవర్, కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్, సిప్లా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, విప్రో, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, టాటా మోటార్స్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,874 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,671 కంపెనీలు లాభాలను, 1,026 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 1,05,65,565 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,06,53,717 కోట్లుగా నమోదైంది.

More Telugu News