: ఇండో అమెరికన్ల మద్దతు హిల్లరీకే!... క్లింటన్ సతీమణికి పెరుగుతున్న విజయావకాశాలు!

అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ దేశంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతోన్న ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ కు నానాటికీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఖరారైన ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ కు నానాటికీ మద్దతు పెరుగుతోంది. ఇప్పటి దాకా వెలువడ్డ అన్ని సర్వేల్లోనూ ట్రంప్ కంటే హిల్లరీకి 4 శాతం మేర విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన వారంతా కూడా హిల్లరీకే మద్దతు తెలిపారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన హిల్లరీ వలస విధానంలో అవలంబించిన వైఖరి కారణంగానే ప్రవాస భారతీయులు ఆమె పట్ల మొగ్గు చూపుతున్నారు. తాను అధికారంలోకి వస్తే... వలస విధానంలో సమూలంగా మార్పులు చేస్తానంటున్న ట్రంప్ పట్ల అక్కడి ఇతర దేశస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో హిల్లరీకి మాత్రం ఎన్నారైలతో పాటు వివిధ దేశాలకు చెందిన వారంతా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఇక హిల్లరీ ప్రచార బృందంలోని తెలుగు నేలకు చెందిన వ్యక్తులు అక్కడి ప్రవాసీయుల మద్దతును కూడగట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారట.

More Telugu News