: రికార్డు సమయంలో రూ. 100 కోట్లకు జంప్ చేస్తున్న ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు

ఇండియాలో బ్రాండెడ్ ఉత్పత్తుల వాడకం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఫుడ్ సెగ్మెంటులో విడుదలైన ఎన్నో బ్రాండ్లు రికార్డు సమయంలో రూ. 100 కోట్ల బ్రాండ్లుగా ఎదుగుతున్నాయి. ఓ సంవత్సరం క్రితం మాండెలెజ్ ఇండియా, క్యాడ్ బరీ డైరీ మిల్క్ 'సిల్క్' గొడుగు కింద 'బబ్లీ' అంటూ కొత్త చాక్లెట్ వెరైటీని విడుదల చేసింది. ఆపై ఆరు నెలల వ్యవధిలోనే బబ్లీ అమ్మకాలు రూ. 100 కోట్లను అధిగమించాయి. మాండెలెజ్ ఇండియా, చాక్లెట్ బ్రాండ్లలో ఇంత త్వరగా 100 కోట్ల మార్క్ అధిగమించినది ఇదే. అంతకుముందు ఏప్రిల్ 2015లో రజనీగంధా పాన్ మసాలాను మార్కెటింగ్ చేస్తూ పేరు తెచ్చుకున్న డీఎస్ గ్రూప్, హార్డ్ బాయిల్డ్ క్యాండీ విభాగంలో 'పల్స్'ను ప్రవేశపెట్టగా, ఇది సూపర్ హిట్టయింది. ఏడు నెలల వ్యవధిలోనే, అంటే నవంబర్ 2015 నాటికి రూ. 100 కోట్ల గ్రూప్ లోకి చేరిపోయింది. మరో నాలుగైదు నెలల్లో రూ. 200 కోట్ల మార్క్ ను తాకుతుందని డీఎస్ గ్రూప్ నమ్మకంగా ఉంది. ఇవి మాత్రమే కాదు, శీతల పానీయాల విభాగంలో కోక-కోలా విడుదల చేసిన నో షుగర్ వేరియంట్, కోక్ - జీరో, 15 రోజుల వ్యవధిలో లక్ష క్యాన్ల అమ్మకాలను సాధించింది. అమేజాన్ లో తొలిసారిగా విడుదలైన కోక్ - జీరో సెప్టెంబర్ 2014లో మార్కెట్లోకి వచ్చి ఎనిమిది నెలల వ్యవధిలో రూ. 100 కోట్ల బ్యాచ్ లోకి చేరింది. జీఎస్కే విడుదల చేయగా, జనవరి 2011లో 'సెన్సోడైన్' సెన్సిటివిటీ టూత్ పేస్టు రెండున్నరేళ్లకు, ఇదే సంస్థ నుంచి వచ్చిన హార్లిక్స్ కొత్త వెరైటీలు మూడేళ్లకు, ఓట్రివిన్ రెండేళ్లకు రూ. 100 కోట్ల మార్క్ ను అధిగమించాయి. ప్రజలు ఖర్చు పెట్టడం అధికమైందని, అందువల్లే బ్రాండెడ్ ప్రొడక్టుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని టెక్నోపార్క్ చైర్మన్ అరవింద్ సింఘాల్ వ్యాఖ్యానించారు. తక్కువ వ్యవధిలో మూడంకెల సంఖ్య టర్నోవర్ ను చేరుతున్న బ్రాండ్ల సంఖ్య పెరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఫుడ్ సెగ్మెంట్ లోని పలు ఉత్పత్తులు ఈ ఘనతను అచిరకాలంలోనే అందుకుంటున్నాయని కొన్ని రూ. 200 కోట్లను కూడా దాటాయని వివరించారు.

More Telugu News