: నిరుత్సాహపరచిన ఇన్ఫోసిస్... 4.3 శాతం తగ్గిన లాభం

భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో రూ. 3,440 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్టు తెలిపింది. అంతకుముందు ఆర్థిక విశ్లేషకులు సంస్థ నికర లాభం రూ. 3,437 కోట్ల వరకూ ఉంటుందని అంచనాలు వేయగా, వాటికి దగ్గరగానే ఫలితాలు ఉన్నాయి. ఇదే సమయంలో అంతకుముందు మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం నెట్ ప్రాఫిట్ 4.3 శాతం తగ్గింది. గడచిన ఆర్థిక సంవత్సరం క్యూ-4లో ఇన్ఫీ నికర లాభం రూ. 3,597 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ లాభాలు తగ్గాయన్న వార్తలు ఈ ఉదయం సంస్థ ఈక్విటీపై ప్రభావాన్ని చూపాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో, సంస్థ వాటా విలువ ఏకంగా 4 శాతానికి పైగా పడిపోయి రూ. 1120కి చేరింది. ఇక ఈ ఏడాది ఆదాయ అంచనాలను సైతం ఇన్ఫోసిస్ తగ్గించుకుంది. ఈ సంవత్సరం 10.5 నుంచి 12 శాతం మేరకు రెవెన్యూ గ్రోత్ ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకుముందు సంస్థ ఆదాయ వృద్ధిని 11.7 నుంచి 13.2 శాతం మధ్య ఉంటుందని వెల్లడించింది.

More Telugu News