: ఫ్రాన్స్‌లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 75 మంది దుర్మరణం... ఉగ్రదాడి?

ఫ్రాన్స్‌లో జన సమ్మర్థంగా ఉన్న ప్రాంతంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. జనాలపైకి దూసుకెళ్లడంతో ఏకంగా 75 మంది మృతి చెందారు. మరో వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నైస్‌లోని ఫ్రెంచ్ రివేరా రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాస్టిల్ డే సందర్భంగా నిర్వహించిన బాణసంచా ప్రదర్శనను వీక్షించి వెళ్తున్న ప్రజలపైకి ఒక్కసారిగా ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. వందలాదిమందిని ఢీకొట్టింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు తాను తుపాకి పేలుళ్లను విన్నట్టు చెప్పాడు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత లేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గతేడాది నవంబరులో పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజా ఘటన కూడా ఉగ్రదాడే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదో ‘మేజర్ క్రిమినల్ ఎటాక్’ అని ఆల్ప్స్-మారిటైమ్ రీజియన్ సబ్-ప్రెఫెక్ట్ సెబాస్టియన్ హంబర్ట్ పేర్కొన్నారు. ట్రక్కు బీభత్సంతో కకావికలైన ప్రజలు ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. గతేడాది ఉగ్రదాడి తర్వాత విధించిన స్టేట్ ఎమర్జెన్సీ ఈ నెలాఖరు నాటికి ముగియనుందని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.

More Telugu News