: ఆ గంటన్నర ఆట నా జీవితాన్నే మార్చేసింది!: మదిలోని ముచ్చట చెప్పిన మహ్మద్ కైఫ్

మహ్మద్ కైఫ్... భారత క్రికెట్ జట్టులో ఎక్కువ కాలం నిలబడనప్పటికీ, ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో క్రికెట్ వీరాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అదే నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్. భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా హేమాహేమీలంతా పెవిలియన్ దారి పట్టగా, అప్పుడప్పుడే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ లు ఆడిన తీరు, ఇప్పటికీ అద్భుతమే. ఇక ఆ మ్యాచ్ జరిగి 14 సంవత్సరాలైన సందర్భంగా తన మదిలోని ఆ అనుభూతిని కైఫ్ పంచుకున్నాడు. తాను గంటన్నర పాటు ఆడిన ఆట, తన జీవితాన్నే మార్చేసిందని తెలిపాడు. "నేను యూపీలోని చిన్న పట్టణం నుంచి వచ్చాను. భారత క్రికెట్ జట్టుకు ఆడాలన్నదే నా కోరిక. అది తీరింది. ఆపై జట్టులో కుదురుకోవాలని ఆశిస్తున్న నాకు క్రికెట్ ఆఫ్ మక్కాగా పిలవబడే లార్డ్స్ లో గంటన్నరాట ఎంతో సాయపడింది. ఆనాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ నా నుంచి కోరుకున్న ఆటను నేను అందించగలిగాను. ఆ రోజును జీవితంలో మరచిపోలేను. ఓ ఆల్ రౌండర్ స్థానంలో బ్యాట్స్ మెన్ ను తీసుకోవాలన్న గంగూలీ ఆలోచన తుది జట్టులో నాకు స్థానం కల్పించింది" అన్నాడు. "తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 326 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ స్కోరును చేరడం 14 ఏళ్ల క్రితం దాదాపు అసాధ్యమే. కానీ గంగూలీ జట్టును నమ్మాడు. తొలి 15 ఓవర్లలో సెహ్వాగ్ తో కలసి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు సాధించాలని ముందుగా అనుకున్నాం. 14.3 ఓవర్లకు 106 పరుగులు చేసిన వేళ, గంగూలీ 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అది జట్టుకు బలమైన పునాది అయినప్పటికీ, ఆ వెంటవెంటనే 32 పరుగుల తేడాలో సెహ్వాగ్, దినేష్ మోంగియా, ద్రావిడ్, టెండూల్కర్ లు అవుట్ అయ్యారు. 24 ఓవర్లలో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పట్లో సచిన్ అవుట్ అయితే, మ్యాచ్ ఓడిపోయినట్లే భావించేవారు. సచిన్ మైదానం నుంచి బయటకు వస్తున్న వేళ, నేను బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్నాను. అప్పుడు సచిన్ ముఖం చూడాలని అనిపించింది. ఆయన మాత్రం తలవంచుకునే నాకు ఎదురు వచ్చాడు. ముఖంలో నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది" అని నాటి స్మృతులను కైఫ్ గుర్తు చేసుకున్నాడు. "నేను కూడా ఈ మ్యాచ్ ని గెలుస్తామని అనుకోలేదు. పరాజయాన్ని సాధ్యమైనంత తక్కువ పరుగులకు పరిమితం చేయాలని భావించాం. అంతకుముందు నాకు గంగూలీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 7వ నంబర్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి దిగి 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే, ఓపెనర్ గా వచ్చి సెంచరీ చేసినట్టని ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవతలి ఎండ్ లో ఉన్న యువరాజ్, నేను కలసి స్కోరును ముందుకు సాగించాం. అవకాశం చిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టాం. యువరాజ్ 42వ ఓవర్ లో 69 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికీ విజయానికి మరో 59 పరుగులు చేయాల్సి వుంది. చేతిలో 8 ఓవర్లు ఉండటంతో టెయిలెండర్ల సాయంతో జట్టును విజయానికి దగ్గర చేశాను. ఈ విజయం జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసింది" అని వివరించాడు. మహ్మద్ కైఫ్... 2000 సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ ను గెలుచుకున్న భారత జట్టు కెప్టెన్. భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. 2002లో జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్స్ లో కైఫ్ ఆడిన ఇన్నింగ్స్, ఇండియన్ క్రికెట్ అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో 75 బంతులను ఎదుర్కొన్న కైఫ్ 6 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 87 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో హర్భజన్ 13 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 15 పరుగులు చేసి సహకరించడంతో మరో 3 బంతులు మిగిలి వుండగానే జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.

More Telugu News