: జకీర్ కు 2010లోనే ఝలక్కిచ్చిన ప్రస్తుత బ్రిటన్ ప్రధాని ధెరెస్సా మే!

ఇస్లామిక్ మత బోధనల పేరిట ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ కు సమస్యలు పెద్దగా కొత్తేమీ కాదట. నిన్న రాత్రి బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ధెరెస్సా మే... 2010లోనే ఆయనకు చుక్కలు చూపారు. బ్రిటన్ ప్రధానిగా ధెరెస్సా మే పదవీ బాధ్యతలు చేపట్టడం, అంతకు కొన్ని రోజుల ముందుగా జకీర్ నాయక్ పై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో 2010లో ‘టెలిగ్రాఫ్’ పత్రిక రాసిన ఓ కథనం తాజాగా వెలుగుచూసింది. ఇస్లామిక్ మత బోధనల పేరిట రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని జకీర్ పై ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఈ మేరకు 2010లో ఆయన బ్రిటన్ లో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రిటన్ లోని పలు నగరాల్లో ఆయన ప్రసంగాలకు ఏర్పాట్లు జరిగిపోయాయి. బ్రిటన్ బయలుదేరేందుకు జకీర్ నాయక్ ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇంకొద్దిసేపు ఉంటే ఆయన బ్రిటన్ విమానం ఎక్కి ఉండేవారే. అయితే, అంతకు ముందే బ్రిటన్ హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ధెరెస్సా మే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అలవాటు ఉన్న జకీర్ కు తమ దేశంలోకి ప్రవేశం లేదని ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే జకీర్ బ్రిటన్ లో అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. వెరసి జకీర్ నాయక్ బ్రిటన్ వీసాపై ఐదేళ్ల పాటు నిషేధం అమల్లోకి వచ్చేసింది. దీంతో షాక్ తిన్న జకీర్ బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకుని తిరుగు ముఖం పట్టక తప్పలేదు.

More Telugu News