: బ్రిటన్ ప్రధానిగా చార్జి తీసుకున్న ధెరెస్సా మే! ... థాచర్ తర్వాత రెండో మహిళగా చరిత్ర పుటల్లోకి!

బ్రిటన్ ప్రధానిగా ధెరెస్సా మే పదవీ బాధ్యతలు స్వీకరించారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమె బ్రిటన్ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ధెరెస్సా మే రికార్డుల్లోకి ఎక్కారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ధెరెస్సా మే... మెయిడెన్ హెడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. రాజకీయ తెరంగేట్రం చేసిన నాటి నుంచే తనదైన శైలిలో సత్తా చాటుతూ ముందుకు సాగిన ఆమె ఆ దేశ హోం శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. నిన్న ప్రధాని పదవి చేపట్టేదాకా కూడా ఆమె హోం శాఖ మంత్రిగానే పనిచేశారు. ప్రధాని పీఠంపై కూర్చోవడానికి ముందే ఆమె కేబినెట్ లో భారీ మార్పులు చేశారు. తాను ఖాళీ చేసిన హోం శాఖకు ఆంబర్ రెడ్ ను నియమించిన ధెరెస్సా మే... విదేశాంగ శాఖ బాధ్యతలను బోరిస్ జాన్సన్ కు అప్పగించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన భర్త ఫిలిప్ మే తో కలిసి ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’కు వెళ్లిపోయారు.

More Telugu News