: వంద కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డరిచ్చిన ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా మరిన్ని సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా విమానాల సంఖ్య పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో 100 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. ఏ321 నియో రకం విమానాలను ఎయిర్ బస్ సంస్థ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఫార్న్ బరోలో జరుగుతున్న ఎయిర్ షోలో ఈ ఒప్పందం జరిగినట్టు ఎయిర్ బస్, ఎయిర్ ఏషియా సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ ఏషియా వద్ద ఎయిర్ బస్ కు చెందిన ఏ321 నియో రకం విమానాలు 170 ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమ‍్ముడవుతున్న ఏ321 నియో రకం విమానాలకు వచ్చిన అతి పెద్ద ఆర్డర్ ఇదేనని ఎయిర్ బస్ ప్రకటించింది. ఏ321 రకం విమానాలు తమ ప్రయాణ అవసరాలకు సరిపోతాయని ఎయిర్ ఏషియా తెలిపింది. ఇంధన ఖర్చులు కూడా అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. దీంతో టికెట్ ధరలను తగ్గించే వెసులుబాటు తమకు కలుగుతుందని ఎయిర్ ఏషియా ప్రతినిధులు తెలిపారు. దీనికి తోడు దేశంలోని సాధారణ మౌలిక సదుపాయాలున్న అన్ని ఎయిర్ పోర్టుల నుంచి వీటిని నడిపించే వీలు కలుగుతుందని...ఈ విమానాల ద్వారా ఒకేసారి 236 మందిని తరలించవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

More Telugu News