: సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయిన వేళ, మెరిసిన మిడ్ క్యాప్!

భారత స్టాక్ మార్కెట్లో మరో సెషన్ ఒడిదుడుకులకు పరిమితమైంది. సెషన్ ఆరంభంలోని లాభాలు నిమిషాల వ్యవధిలో నష్టాలుగా మారిపోగా, ఆపై పడుతూ, లేస్తూ సాగిన బెంచ్ మార్క్ సూచికలు చివరకు నష్టాల్లోనే నిలిచాయి. ఇదే సమయంలో మిడ్ క్యాప్ సెక్టార్ మాత్రం మెరిసింది. మిగతా సెక్టోరల్ ఇండెక్స్ లు నష్టాలను చవిచూసిన వేళ మిడ్ క్యాప్ లాభపడింది. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 74.59 పాయింట్లు పడిపోయి 0.27 శాతం నష్టంతో 27,126.90 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 14.70 పాయింట్లు పడిపోయి 0.18 శాతం నష్టంతో 8,323.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.11 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.17 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అరవిందో ఫార్మా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐడియా, గెయిల్, భారతీ ఎయిర్ టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,860 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,165 కంపెనీలు లాభాలను, 1,539 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,04,05,759 కోట్లుగా ఉండగా, అది నేడు రూ. 1,03,84,924 కోట్లకు తగ్గింది.

More Telugu News