: సౌదీ పేలుళ్ల ఘటనలో 12మంది పాకిస్థానీయుల అరెస్ట్‌

నాలుగు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని మదీనా సహా పలు చోట్ల ఉగ్ర‌వాదులు పేలుళ్లు జ‌రిపి ఏడుగురి మ‌ర‌ణానికి కార‌ణ‌మయిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొంతమందికి గాయాల‌యి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసిన అధికారులు 12 మంది పాకిస్థాన్‌కు చెందిన అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. సౌదీలో జ‌రిపిన సోదాల్లో దాడులకి కార‌ణ‌మ‌ని భావిస్తోన్న 19 మందిని అరెస్టు చేశామ‌ని, వారిలో 12 మంది పాకిస్థానీయులే ఉన్నార‌ని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఏ ఉగ్ర‌వాద సంస్థ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బాధ్య‌త వ‌హిస్తున్నట్లు ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ షియా ముస్లింలపై సౌదీలో దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థే తాజా దాడికి కారణమని భావిస్తున్నారు. మ‌దీనాలో దాడులు జ‌ర‌ప‌డానికి సంబంధించి ఓ సౌదీ వ్యక్తి హ‌స్తం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. సౌదీలోని ఉగ్ర‌దాడి జ‌రిగిన మ‌రోప్రాంతం జెడ్డాలో కాల్పుల వెనుక పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్లా ఖల్‌జర్‌ ఖాన్‌ హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడుల ఘ‌ట‌న‌పై అధికారులు మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

More Telugu News