: 77 ఏళ్ల ఈ దొంగ సామాన్యుడు కాదు.. 52 ఏళ్ల కెరీర్‌లో 500 కార్లు దొంగిలించాడు.. ఇంకా అదే బాటలో..!

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు.. 77 ఏళ్ల వృద్ధుడు ధనిరామ్ మిట్టల్ విషయంలో ఇది నిజమనే నమ్మాలి. సూపర్ నట్వర్‌లాల్‌గా పోలీసు రికార్డుల కెక్కిన ఈ ఇండియన్ శోభరాజ్ మామూలు దొంగ కాదు.. సూపర్ థీఫ్. 1964లో మొట్టమొదటిసారి పోలీసులతో బేడీలు వేయించుకున్న ఈ దొంగ మంగళవారం 25వ సారి పోలీసులకు చిక్కాడు. గత నెలలోనే కారు దొంగతనం కేసులో అరెస్టయిన ధనిరామ్ బెయిలుపై విడుదలైన కొద్ది రోజుల్లోనే మళ్లీ అరెస్టయ్యాడు. ఈ దొంగ చేష్టలు తెలిసిన ప్రతీ ఒక్కరూ అవాక్కవుతున్నారు. అచ్చం సినిమాల్లోలా వేషాలు మార్చి దొంగతనాలకు పాల్పడడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. పోలీసు, జడ్జి, సీఐ, ప్రభుత్వ అధికారి.. ఇలా చెప్పుకుంటూ పోతే అతని వేషాలెన్నో. 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్క్‌గా చేరిన ధని రామ్ జడ్జి సెలవుల్లో ఉండగా ఏకంగా జడ్జిగా అవతారమెత్తి రెండు నెలలపాటు కొనసాగాడు. పలువురు నేరగాళ్లకు ఎడాపెడా బెయిలు మంజూరు చేసి పారేశాడు. లా గ్రాడ్యుయేట్ అయిన ధనిరామ్ రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారిగా కారు పేపర్లు ఫోర్జరీ చేసి అరెస్టయ్యాడు. ఆ కేసును కోర్టులో తనే వాదించుకున్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో 1968లో రోహ్‌తక్ రైల్వే స్టేషన్ మాస్టర్ అయ్యాడు. ఏడాది తర్వాత నిజం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. అతని 52 ఏళ్ల కెరీర్‌లో 128 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 77 ఏళ్ల వయసులో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎటువంటి కారునైనా నిమిషంలోనే అన్‌లాక్ చేసి తుర్రుమనడం ఈ దొంగగారి ప్రత్యేకత. ఇప్పటి వరకు 500 కార్లను దొంగిలించిన ఆయన ఎక్కువగా ఎస్టీమ్, మారుతి 800, హుందయ్ శాంత్రో తదితర కార్లను దొంగతనానికి ఎంచుకుంటాడు. వాటికి డిజిటల్ లాక్ లేకపోవడమే ఇందుకు కారణం. దొంగిలించిన వాటిని కండీషన్ బట్టి పశ్చిమ ఢిల్లీలోని యూజ్‌డ్ కార్ డీలర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేస్తాడు. అతడిని జైలు గదిలో అందరితో కలిపి ఉంచేందుకు అధికారులు సైతం భయపడుతుంటారు. ఇతర ఖైదీలను తన వాక్చాతుర్యంతో మెప్పిస్తాడు. వారిని ఆకట్టుకుంటాడు. తనకు తెలిసిన ‘లా’ గురించి పూర్తిగా వివరిస్తాడు. దీంతో వారి కేసును వారే వాదించుకుంటున్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. కాగా ధనిరామ్ అవుటర్ ఢిల్లీలోని నరేలాలో భార్య, కోడలుతో కలిసి ఉంటున్నాడు. తండ్రి చేష్టలతో విసుగు చెందిన ఇద్దరు కుమారులు వేర్వేరుగా ఉంటున్నారు.

More Telugu News