: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

అమ్మకాల ఒత్తిడి ఒక్క రోజుకే పరిమితమైంది. వరుస లాభాల్లో పయనిస్తూ వచ్చిన సూచికలను మంగళవారం నాటి సెషన్లో లాభాల స్వీకరణ కుదేలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై నిన్న రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, నేడు ఆరంభంలోనే సూచికలు లాభాల్లోకి నడిచాయి. ఆపై మధ్యాహ్నం తరువాత కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ, చివరకు లాభాల్లోనే మార్కెట్ ముగిసింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 34.62 పాయింట్లు పెరిగి 0.13 శాతం లాభంతో 27,201.49 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 1.95 పాయింట్లు పెరిగి 0.02 శాతం లాభంతో 8,337.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.41 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.04 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభపడ్డాయి. లుపిన్, హిందాల్కో, హిందుస్థాన్ యునీలివర్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, జడ్ఈఈఎల్, టీసీఎస్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,900 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,546 కంపెనీలు లాభాలను, 1,207 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,04,12,224 కోట్లుగా ఉండగా, అది నేడు రూ. 1,04,05,759 కోట్లకు తగ్గింది.

More Telugu News