: త్రివిక్రమ్ కు పవన్ కల్యాణ్ రాసిన లెటర్... సామాజిక మాధ్యమాల్లో హల్ చల్

ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ పుస్తకం పవర్ స్టార్ కు నచ్చడంతో ఎంతో ఆనందించిన పవన్, త్రివిక్రమ్ కు తన కృతజ్ఞతలు తెలుపుతూ ఇటీవల ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 18/05/2016 తేదీన రాసినట్లుగా ఉన్న ఈ లేఖలో పవన్ ప్రస్తావించిన విషయాలు... ‘ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు’ అన్న మహాకవి శేషేంద్ర మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చేశాయని, ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన ప్రశ్న తనకు మహావాక్యం అయిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘ఆధునిక మహాభారతం’ గ్రంథం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే వారికి అందుబాటులో ఉండాలన్న తన ఆకాంక్ష, ఈ గ్రంథాన్ని మరోమారు మీ ముందుకు తీసుకువచ్చేలా చేసిందని, తనకు ఈ అవకాశాన్ని కల్పించిన మహాకవి శేషేంద్ర కుమారుడు సాత్యకి, తనకు ఈ మహాకవిని పరిచయం చేసిన తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ పవన్ కల్యాణ్ ఆ లేఖలో రాశారు. కాగా, ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ లో శేషేంద్ర రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకం కనిపిస్తే త్రివిక్రమ్ కొని చదివడం, ఆ పుస్తకం ఎంతో బాగుందని చెప్పి, పవన్ కల్యాణ్ కి త్రివిక్రమ్ ఇవ్వడం తెలిసిందే. ఈ పుస్తకంతో ఎంతో స్ఫూర్తి పొందిన పవన్ ఆ పుస్తకం మలి ముద్రణ నిమిత్తం 25,000 కాపీలకు అవసరమయ్యే ఖర్చు తాను భరిస్తానని, శేషేంద్ర శర్మ కుమారుడితో పవన్ ఫోన్ లో మాట్లాడటం విదితమే.

More Telugu News