: గంటలో కోహ్లీ రెండు సార్లు ఔట్!... కుంబ్లే తొలి పరీక్షలో రెహానే ఒక్కడే పాస్!

విరాట్ కోహ్లీ... టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ హోదాలో ఉన్న ఈ చిచ్చర పిడుగు క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందే. అది టెస్టు మ్యాచ్ అయినా, వన్డే అయినా, టీ20 అయినా... పరిస్థితి ఇదే. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న కోహ్లీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే టీమిండియాకు హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పెట్టిన తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క కోహ్లీనే కాదండోయ్... అజింక్యా రెహానే మినహా ఏ ఒక్కరు కూడా కుంబ్లే తొలి పరీక్షలో నెగ్గలేకపోయారు. అంటే కుంబ్లే అంతటి కఠిన పరీక్ష పెట్టారా? అంటే... అదేమీ లేదు గాని ప్రాక్టీస్ సెషన్ లో టెస్టు మ్యాచ్ లో కట్టుకునే ప్యాడ్లతో బరిలోకి దిగమన్నాడు. అంతేకాదు, గంట పాటు ఔట్ కాకుండా బంతులను ఎదుర్కోవాలని సూచించాడు. అయితే ఈ గంట పాటు కూడా కోహ్లీ క్రీజులో నిలబడలేకపోయాడు. ప్రాక్టీస్ సెషన్ లో కాకుండా ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లలోనే కోహ్లీ గంటల తరబడి ఏకధాటి ఇన్నింగ్ ఆడిన సందర్భాలున్నాయి. మరి కుంబ్లే పెట్టిన పోటీలో కోహ్లీ ఎందుకు నిలబడలేకపోయాడు? వివరాల్లోకెళితే... వెస్టిండిస్ టూర్ కు ముందు నిన్న ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టిన టీమిండియా సభ్యులతో తొలిరోజు యోగాసనాలు వేయించిన కుంబ్లే... రెండో రోజు ఉదయం వారందరినీ బెంగళూరుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఆలూరుకు తీసుకెళ్లాడు. అక్కడ టెస్టు మ్యాచ్ లలో కట్టుకునే ప్యాడ్లిచ్చి రంగంలోకి దించాడు. గంట పాటు ఔట్ కాకుండా ఆడాలని ఓ పోటీ పెట్టాడు. అదే సమయంలో వీలయినన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టాలని బౌలర్లను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ కు బోల్తా పడ్డ కోహ్లీ... అతడి బౌలింగ్ లోనే కేవలం గంట వ్యవధిలో రెండు సార్లు ఔటయ్యాడు. ఇక ఓపెనర్లుగా సత్తా చాటుతున్న శిఖర్ ధావన్, మురళీ విజయ్ లు కూడా కేవలం గంట పాటు క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క అజింక్యా రెహానే మినహా ఏ ఒక్కరు కూడా కుంబ్లే ‘గంట’ పరీక్షలో నెట్టుకురాలేకపోయారట.

More Telugu News