: రూ. 40 వేల కోట్ల సేకరణ లక్ష్యంగా మార్కెట్ ను తాకనున్న ఐపీఓ సునామీ!

2016లో సగం కాలం గడిచిపోయింది. ఈ ఆరు నెలల వ్యవధిలో పలు కంపెనీలు నిధుల సమీకరణ నిమిత్తం స్టాక్ మార్కెట్లను ఆశ్రయించి విజయం సాధించాయి. ఇక రెండో సగ భాగంలో, మొత్తం 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40,350 కోట్లు - ఒక డాలర్ మారకపు విలువ రూ. 67.25పై) నిధుల సేకరణ కోసం పెట్టుబడిదారుల ముందుకు రానున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని ఆ దేశ ప్రజలు తీర్పిచ్చిన వేళ, తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు, ఆపై నిలదొక్కుకుని స్థిరమైన లాభాలతో పయనిస్తుండటంతో ఐపీఓకు వచ్చే కంపెనీలను ఇన్వెస్టర్లు ఆదరిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వారంలో క్వెస్ కార్పొరేషన్ రూ. 400 కోట్ల సమీకరణ కోసం మార్కెట్ ను ఆశ్రయించగా, విక్రయానికి ఉంచిన ఈక్విటీలతో పోలిస్తే, 144 రెట్ల అధిక స్పందన లభించింది. ఇక గత శుక్రవారం నాడు తొలిసారిగా లిస్టింగ్ అయిన మహానగర్ గ్యాస్, మొదటి రోజునే 30 శాతం పెరిగి సత్తా చాటింది. ఇక తాజాగా రానున్న ఐపీఓల్లో ముఖ్యమైనది ఎల్అండ్ టీ ఇన్ఫోటెక్. మొత్తం 183 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1200 కోట్లు) లక్ష్యంగా ఎల్అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. బ్రెగ్జిట్ తరువాత ఇండియా మార్కెట్ పెరుగుతున్న తీరును ప్రపంచమంతా గమనిస్తోందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఉత్సాహంగా ఉన్నారని మార్కెట్ పండితులు వ్యాఖ్యానించారు. గడచిన ఆరేళ్లలోనే అత్యధికంగా జనవరి నుంచి జూన్ వరకూ నిధుల సేకరణ జరుగగా, వచ్చే ఆరు నెలల్లో అంతకు మించిన వాటాల విక్రయాలు సాగుతాయని అంచనా. ఎల్అండ్ టీ ఐపీఓ తరువాత చెప్పుకోతగ్గవి వోడాఫోన్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ వాటాల అమ్మకాలు. వోడాఫోన్ సుమారు రూ. 16 వేల కోట్ల విలువైన వాటాలను, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ రూ. 6,700 కోట్ల నిధుల కోసం మార్కెట్ ను ఆశ్రయించనున్నాయి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లలో ఐపీఓల బిజీ కనిపిస్తోందని కోటక్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ హెడ్ (ఈక్విటీ విభాగం) సుబ్రజిత్ రాయ్ వివరించారు. కాగా, మొత్తం 30కి పైగా కంపెనీలు వచ్చే ఆరు నెలల్లో మార్కెట్ కు వస్తాయని అంచనా. వీటిల్లో 20కి పైగా కంపెనీలు ఇప్పటికే సెబీ నుంచి అనుమతులను పొందగా, మిగతావి బోర్డు డైరెక్టర్ల అనుమతులు, ప్రతిపాదనల స్థాయుల్లో ఉన్నాయి. వోడాఫోన్ ఐపీఓ ఆగస్టులో రానుందని తెలుస్తోంది. ఇండియాలో లిస్టింగ్ అయిన తొలి ప్రైవేటు సెల్ ఫోన్ సేవల సంస్థగా ఐడియా సెల్యులార్ నిలిచిన 9 సంవత్సరాల తరువాత మరో టెలికం సంస్థ మార్కెట్ కు రానుండటం గమనార్హం.

More Telugu News