: వేలానికి ‘సహారా’ ఆస్తులు!... 5 ఆస్తులకు రూ.722 కోట్ల రిజర్వ్ ధరను ప్రకటించిన హెచ్ డీఎఫ్ సీ రియాల్టీ!

వేలాది మందిని నట్టేట ముంచిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సహారా ఇండియా పరివార్’ ఆస్తులు వేలానికి వచ్చేశాయి. వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన ఆ సంస్థ చీఫ్ సుబ్రతో రాయ్... మెచ్యూరిటీ తీరిన బాండ్లకు చెందిన సొమ్మును చెల్లించడం లేదన్న ఆరోపణలపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన సుబ్రతో రాయ్ నెలల తరబడి జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన ఆయన డిపాజిట్ సొమ్మును చెల్లించే పనిని పక్కనబెట్టి... దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ఉద్యోగులు, డిపాజిటర్లతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సహారా ఆస్తులను గుర్తించిన సెబీ.. వాటిని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా ఐదు ఆస్తుల వేలాన్ని సెబీ... హెచ్ డీఎఫ్ సీ రియాల్టీకి అప్పగించింది. ఈ ఆస్తులకు రూ.722 కోట్ల రిజర్వ్ ధరను (కనీస అంగీకార ధర) ప్రకటించిన హెచ్ డీఎఫ్ సీ రియాల్టీ వాటిని వేలానికి పెట్టింది. నిన్ననే ఈ-వేలానికి వచ్చిన ఈ ఆస్తులను దక్కించుకునేందుకు బిడ్డర్లు ముందుకు వస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేలం ముగియగానే ఎస్బీఐ క్యాప్ ఆధ్వర్యంలో సహారాకు చెందిన మరో ఐదు ఆస్తులు ఈ నెల 7న వేలానికి రానున్నాయి. దీనికి రూ. 470 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించారు.

More Telugu News