: 'అల్లా హు అక్బర్' అంటూ సాటి ప్రయాణికులను బెంబేలెత్తించిన వ్యక్తికి జైలు శిక్ష!

'అల్లా హు అక్బర్' అంటూ ఒకేఒక్క అరుపుతో విమానంలోని 347 మందిని బెంబేలెత్తించిన వ్యక్తికి న్యాయస్థానం పది నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన పూర్వాపరాలలోకి వెళితే, గత ఫిబ్రవరి 1న దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ కు ఫ్లై ఎమిరేట్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం 347 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విమానం గాల్లో లేచి ఎగరడం ప్రారంభించిన అనంతరం షెహ్రాజ్ సర్వార్ (38) అనే వ్యక్తి సీట్లోంచి అమాంతం పైకిలేచి 'అల్లా హు అక్బర్' అంటూ అరవడం ప్రారంభించాడు. అంతే, ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. కొంత మంది ఇక బతకడం కల్ల అని భయపడిపోయారు. మరి కొందరైతే ఇక భూమిమీద నూకలు చెల్లిపోయాయని భావించి సీట్లోనే ఏడ్చేశారు. ఇంతలో విమానం గమ్యస్థానం చేరుకుంది. సీట్ బెల్టు పెట్టుకోమని అనౌన్స్ మెంట్ వినిపించినా అతను వినిపించుకోలేదు సరికదా రెండుసార్లు తిరస్కరించాడు. సిబ్బంది అందించిన ఆహారపదార్థాలను కూడా విసిరికొట్టాడు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు మరోసారి గట్టిగా అరిచాడు. దీంతో విమానం ల్యాండ్ అవ్వగానే సిబ్బంది సహాయంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతనిని, దోషిగా నిర్ధారించి, తాజాగా తీర్పు ఇస్తూ, అతనికి పది నెలల జైలు శిక్ష విధించింది.

More Telugu News