: యూఎస్ ఇండిపెండెన్స్ డే వేళ.. సౌదీలోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఉగ్రదాడి

ప్రపంచాన్ని ఉగ్రదాడులు వణికిస్తున్నాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా ముష్కరులు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో ఊచకోతకు తెగబడ్డారు. ఆ వెంటనే బాగ్దాద్‌లో నరమేధానికి పాల్పడ్డారు. తాజాగా సౌదీ అరేబియాలోని జెద్దాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆత్మాహుతి దాడికి దిగారు. ఓ కారులో వచ్చిన ఉగ్రవాది కాన్సులేట్ సమీపంలోని మసీదు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో ఉగ్రవాది తప్ప మరెవరూ మృతిచెందినట్టు సమాచారం లేదు. ఇద్దరు పోలీసులు మాత్రం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దాడితో భయభ్రాంతులకు గురైన కాన్సులేట్ సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆత్మాహుతి దాడితో సౌదీ హై అలర్ట్ ప్రకటించింది. 2004లో యూఎస్ కాన్సులేట్‌పై జరిగిన ఉగ్రదాడిలో 9మంది మృతి చెందారు. కాగా ఈరోజు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతోనే దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

More Telugu News