: సెన్సెక్స్ బుల్ హైజంప్ తో ఇన్వెస్టర్లకు రూ. 1.10 లక్షల కోట్ల లాభం!

మార్కెట్ లాభాలు ఈవేళ కూడా కొనసాగాయి. యూకేలో రెఫరెండం ఫలితాలు వెల్లడైన రోజున భారీగా నష్టపోయిన తరువాత, ఏ సెషన్ లోనూ నష్టపోని భారత మార్కెట్ బుల్, నేడు మరింత హైజంప్ చేసింది. క్రితం ముగింపుతో పోలిస్తే, సెషన్ ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్, మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. మధ్యాహ్నం 12 గంటల తరువాత కొద్దిగా అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ, అది తాత్కాలికమే అయింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 259.33 పాయింట్లు పెరిగి 0.97 శాతం లాభంతో 26,999.72 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 83.75 పాయింట్లు పెరిగి 1.02 శాతం లాభంతో 8,287.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.26 శాతం, స్మాల్ కాప్ 0.94 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 44 కంపెనీలు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బోష్ లిమిటెడ్, సిప్లా, గెయిల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,829 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,600 కంపెనీలు లాభాలను, 1,010 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 1,01,76,749 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,02,85,123 కోట్లకు పెరిగింది.

More Telugu News