: మానవత్వంపై యునెసెఫ్ చేసిన సామాజిక ప్రయోగం!

మారిపోతున్నాడమ్మ మనిషిన్నవాడు...మచ్చుకైనా కానరావడం లేదు మనసున్నవాడు అంటూ ఓ సినీ కవి మనుషుల మనస్తత్వాల గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ వ్యాఖ్యలను యునెసెఫ్ చేసిన ఓ సామాజిక ప్రయోగం కళ్లకు కట్టినట్టు చూపింది. వివరాల్లోకి వెళ్తే...జార్జియాలోని టిబిలిసిలో అనానో అనే ఆరేళ్ల బాలనటిని ఇందులో నటింపజేశారు. బాలనటికి తెలియకుండా కెమెరాలు ఏర్పాటు చేసి, ఆమెను అందంగా ముస్తాబు చేసి, ఓ భారీ కట్టడం బయట నిలబెట్టారు. దీంతో అటుగా వెళ్లేవాళ్లంతా ముద్దులొలికే బాలిక అలా ఎందుకు ఉండిపోయింది? పెద్దలు వదిలేశారా? అంటూ ఆరాతీయడం ప్రారంభించారు. అనంతరం అదే బాలికను వీధిబాలికలా అలంకరించి అదే ప్రాంతంలో నిలబెట్టారు. ఈసారి ఆ బాలికను ఎవరూ పట్టించుకోలేదు సరికదా, అక్కడ కనీసం బాలిక ఉన్నట్టు కూడా గుర్తించకపోవడం విశేషం. రెండోసారి అనానోను మళ్లీ బాగా ముస్తాబు చేసి ఓ రెస్టారెంట్ లోకి పంపించారు. దీంతో అనానో ఏ టేబుల్ దగ్గరకి వెళ్తే అక్కడి వారు ముద్దుచేసి, ఏది అడిగితే అది కొని, తినిపించారు. తరువాత మళ్లీ వీధి బాలిక గెటప్ లో అదే రెస్టారెంట్ లోపలికి పంపారు. ఈసారి అనానోకు ఛీత్కారాలు ఎదురయ్యాయి. వేరే టేబుల్ దగ్గరకి వెళ్లిపొమ్మని కొంత మంది చెబితే, ఇంకొందరు ఆమెను బయటకు పొమ్మన్నారు. దీంతో చిన్నబుచ్చుకున్న అనానో ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. రూపాన్ని బట్టి ఆదరించడం సరికాదని, ఇలాంటి మానసిక వ్యవస్థ కారణంగా అవసరంలో ఉన్న ఎంతో మంది చిన్నారులకు సహాయం అందడం లేదని, మానవత్వానికి ఇది మచ్చలాంటిదని యునిసెఫ్ అభిప్రాయపడింది.

More Telugu News