: ‘కిల్ లిస్ట్’ విడుదల చేసిన ఐఎస్!... 4 వేల మందితో కూడిన జాబితాలో 285 మంది ఇండియన్లు!

‘ప్రత్యేక ఇస్లామిక్ రాజ్య స్థాపన’ లక్ష్యమంటూ రంగప్రవేశం చేసిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. భీకర దాడులకు పాల్పడుతున్న ఆ సంస్థ ఉగ్రవాదులు పలు దేశాల్లో బీభత్సం సృష్టించారు. తాజాగా ఆ సంస్థకు అనుబంధ సంస్థగా భావిస్తున్న ‘క్యాలిఫేట్ సైబర్ ఆర్మీ (సీసీఏ)’ నాలుగు వేల మందితో కూడిన ‘కిల్ లిస్ట్’ను విడుదల చేసింది. తమను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో ఆయా దేశాలకు సహాయంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను టార్గెట్ చేసిన సీసీఏ... జాబితాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లను ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. మొత్తం 4 వేల మందితో కూడిన ఈ జాబితాలో మెజారిటీ వ్యక్తులు అమెరికన్లే అయినప్పటికీ... ఈ జాబితాలో 285 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇక బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్’ పత్రిక గత శుక్రవారం ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. జాబితాలో పేర్కొన్న వ్యక్తుల పేర్లతో పాటు వారి చిరునామాలు, ఈ-మెయిల్ ఐడీలు తదితర సమగ్ర వివరాలను వెల్లడించిన ఈ సంస్థ... జాబితాలో ఉన్న వారిని తక్షణమే చంపేయాలంటూ తన సానుభూతిపరులకు పిలుపునిచ్చింది. జాబితాలో ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లే ఎక్కువగా ఉండటంతో దీనిపై పెద్ద కలకలమే రేగుతోంది.

More Telugu News