: మొదలైన పోటీ... బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ వారసుడెవరు?

యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ భాగంగానే ఉండాలని ప్రచారం చేసి ఓడిపోయిన ప్రధాని డేవిడ్ కామెరాన్, రాజీనామాకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి బ్రిటన్ కు ప్రధానిగా వచ్చి, ఈయూ నుంచి విడాకుల ప్రక్రియను పూర్తి చేసేది ఎవరన్న విషయమై చర్చ సాగుతోంది. వాస్తవానికి 2020లో బ్రిటన్ ఎన్నికల వరకూ కామెరాన్ పదవికి వచ్చిన ఇబ్బందులు లేనప్పటికీ, తన వాదన వీగిన వేళ, పదవిని వీడటమే నైతికత అనిపించుకుంటుందని భావించే ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బ్రిటన్ లో 200 సంవత్సరాల తరువాత అతి తక్కువ వయసులో ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించిన ఆయన, గత సంవత్సరం రెండో విడత ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక బ్రిటన్ చట్టాల ప్రకారం, ప్రధాని పదవిని వీడాలని భావిస్తే, మూడు నెలల ముందుగానే తెలియజేయాలి. తన రాజీనామా నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించేసిన ఆయన, అక్టోబరులో జరిగే పార్టీ సమావేశాల్లో నాయకత్వ బాధ్యతలకు దూరం కానున్నారు. ఆపై తదుపరి ప్రధాని ఎవరన్నది కన్సర్వేటివ్ పార్టీ పెద్దలు నిర్ణయించనున్నారు. వాస్తవానికి 330 మంది ప్రతినిధులున్న కన్సర్వేటివ్ పార్టీలో కామెరాన్ కేబినెట్లోని ఆరుగురు మంత్రులు, 128 మంది ప్రతినిధులు బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేయడం కూడా పోలింగ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఇక రేపు తొలిసారిగా సమావేశమయ్యే కన్సర్వేటివ్ సీనియర్ల కమిటీ, తదుపరి ప్రధాని ఎంపిక ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ పదవిని ఆశిస్తున్న వారిలో బోరిస్ జాన్సన్, మైఖేల్ గోవ్, థెరిసా మే, జార్జ్ ఓస్ బోర్న్ తదితరులున్నారు. బంగారు వర్ణంలో ఉండే జుట్టుతో ఎక్కడున్నా సులువుగా గుర్తించగలిగే బోరిస్ జాన్సన్ ఇప్పటికే బ్రెగ్జిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 52 సంవత్సరాల ఈ మాజీ లండన్ మేయర్, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రజల్లో ప్రచారం చేశారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ ప్రచారం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక మైఖేల్ గోవ్, న్యాయశాఖా మంత్రిగా, కామెరాన్ కు సన్నిహితుడిగా ఉన్నారు. మైఖేల్ కు తన వారసత్వాన్ని అప్పగించాలని కామెరాన్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న థెరిసా మే సైతం ప్రధాని పదవికి గట్టిగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఈయూలోనే బ్రిటన్ ఉండాలని ప్రచారం చేసిన ఆమె కూడా కామెరాన్ సన్నిహితురాలే. ఇక ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్న జార్జ్ ఓస్ బోర్న్ కూడా బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వీరితో పాటు విద్యాశాఖా మంత్రి నిక్కీ మోర్గాన్ కూడా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. బ్రిటన్ ఓటర్లు తమను పాలించే పార్టీని ఎన్నుకుంటారే తప్ప, ప్రత్యక్షంగా ప్రధానిని ఎన్నుకోలేరు. దీంతో మరో ప్రధాని కోసం ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు.

More Telugu News