: కోరి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ పదవిని కాదన్న మిస్టర్ డిపెండబుల్!

టీమిండియాకు ఆడుతున్నంతకాలం మిస్టర్ డిపెండబుల్ గా పేరుపడ్డ రాహుల్ ద్రావిడ్ ‘గ్రేట్ వాలే’. వికెట్ల ముందు పాతుకుపోయే ద్రావిడ్ ను పెవిలియన్ చేర్చడం ప్రత్యర్థి జట్లకు అంత ఈజీ పనేమీ కాదు. జెంటిల్మన్ గేమ్ కు అంతకంటే జెంటిల్మన్ గా గుడ్ బై చెప్పిన ద్రావిడ్ ప్రస్తుతం టీమిండియా జూనియర్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో మెరికలకు సానబడుతున్నాడు. అయితే నిన్న భర్తీ అయిన టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్ పదవి ఆయనను వరించి వచ్చింది. ఈ పదవి కోసం ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఎంపికైన స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సహా జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ లతో కలిసి మొత్తం 57 మంది పోటీ పడ్డారు. 21 మందిని షార్ట్ లిస్ట్ చేసిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు చేసి కుంబ్లేను ఎంపిక చేసింది. ఈ నేఫథ్యంలో నిన్న జట్టు హెడ్ కోచ్ గా కుంబ్లే పేరును అధికారికంగా ప్రకటించే ముందు ధర్మశాలలో బీసీసీఐ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అసలు రాహుల్ ద్రావిడ్ తమ ప్రతిపాదనకు తలాడించి ఉంటే హెడ్ కోచ్ కోసం ఈ సుదీర్ఘ తంతు జరిగి ఉండేదే కాదని ఠాకూర్ చెప్పారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టమని తామే స్వయంగా ద్రావిడ్ ముందు ప్రతిపాదించామని ఆయన చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనకు పెద్దగా విముఖత చూపకున్నా, ఆ బాధ్యతలు తీసుకునేందుకు మాత్రం ద్రావిడ్ సిద్ధపడలేదని చెప్పారు. కుటుంబాన్ని విడిచి సుదీర్ఘ కాలం పాటు దూరంగా ఉండలేనని చెప్పిన ద్రావిడ్... జూనియర్ జట్టు కోచ్ గా ఉంటానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్ గా వచ్చే భారీ వేతనం, ఇతర సౌకర్యాలను ద్రావిడ్... కుటుంబం కోసం వదిలేశాడని కూడా ఠాకూర్ ఆసక్తికరంగా వివరించారు.

More Telugu News