: ఇక యూరోపియన్ యూనియన్ పరిస్థితి ఏంటి? ఎటు వెళుతుంది?

ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమని తెలుస్తున్న వేళ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చిన పెను నష్టమేమీ లేనప్పటికీ, భవిష్యత్ సంకేతాలు కళ్లముందు కనిపిస్తుండటంతో, స్టాక్ మార్కెట్లలో అమ్మకాల జోరే కనిపిస్తోంది. ఇక బ్రిటన్ వెళ్లిపోతే యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి యూరో వార్షిక బడ్జెట్ 145 బిలియన్ డాలర్లు. ఇందులో బ్రిటన్ వాటా 7 బిలియన్ డాలర్లు. బ్రిటన్ వైదొలగితే, ఈయూ లోటులోకి వెళ్లిపోతుంది. ఈయూ ఖాతాల్లోకి బ్రిటన్ నిధులు రావు. యూనియన్ తరఫున బ్రిటన్ లో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీల పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా 'యూకే - ఈయూ' (యునైటెడ్ కింగ్ డమ్, యూరోపియన్ యూనియన్) అంటూ అడ్డుగోడ ఏర్పడుతుంది. ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి పెను విఘాతమే. ముందనుకున్న ఒప్పందం మేరకు వచ్చే సంవత్సరం జూలై నుంచి ఈయూ మినిస్టీరియల్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు బ్రిటన్ కు అప్పగించాల్సి వుంటుంది. బ్రిటన్ వైదొలగితే, ఈ బాధ్యతలు ఈస్టోనియా, మాల్టా లేదా క్రొయేషియాకు దక్కవచ్చు. బ్రిటన్ వెళ్లిపోయినా, మిగతా యూనియన్ సభ్య దేశాల్లో సెంటిమెంట్ నశించకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మిగతా దేశాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడకుంటే, వరల్డ్ మార్కెట్ మరో మాంద్యంలోకి నెట్టి వేయబడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, వాస్తవానికి బ్రిటన్ వైదొలగినా ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బ్రిటన్ లో వ్యాపారానికి, అక్కడ బతుకుతున్న విదేశీయులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇస్తున్నారు.

More Telugu News