: కిం కర్తవ్యం... బ్రిటన్ లో ఇక ఇప్పుడు ఏం జరుగుతుందంటే..!

బ్రిటన్ వాసులు ఈయూ నుంచి విడిపోయేందుకే ఓటేశారని దాదాపుగా ఖరారైంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ నేపథ్యంలో ఇక బ్రిటన్ లో ఏం జరుగుతుంది? ఈ విషయమై ప్రపంచమంతా ఆసక్తి నెలకొంది. రెఫరెండం ఫలితాన్ని అంగీకరించాలన్న నిబంధన ఏమీ లేనప్పటికీ, అత్యధిక ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్న ఒత్తిడి బ్రిటన్ ప్రభుత్వంపై పెరగడం మాత్రం ఖాయం. ఇక ఈ ఉదయం 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30) యూరోపియన్ పార్లమెంట్ నేతలు సమావేశమవుతారు. ఆపై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ రెఫరెండం ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తరువాత ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లౌడీ జుంకర్, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ స్కుల్జ్, డచ్ ప్రధాని మార్క్ రుట్టీ, ఈయూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు సమావేశమై తదుపరి ఏం చేయాలన్న విషయాన్ని చర్చించనున్నారు. బ్రిటన్ వైదొలగితే, ఈయూ ఎకానమీ ఐదింట ఒక వంతు కుంచించుకుపోతుందన్న విషయమై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. బ్రిటీష్ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూనే, ఏర్పడే సమస్యల నుంచి యూనియన్ ను గట్టెక్కించేందుకు ఏ చర్యలు తీసుకోవాలన్న విషయాలు చర్చకు వస్తాయని సమాచారం. యూనియన్ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం లక్సెంబర్గ్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాల నేతలు ఇప్పటికే చేరుకున్నారు. వీరంతా ఒంటిగంటకు (భారత కాలమానంలో మధ్యాహ్నం 3:30 గంటలు) సమావేశమై, ఫలితాలను సమీక్షిస్తారు. ఇదే సమయంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేలు బెర్లిన్ లో సమావేశమై పరిస్థితిని పరీక్షిస్తారు. కొంతమంది యూరో జోన్ ఆర్థిక మంత్రులు బ్రెగ్జిట్ హడావుడి తగ్గిన తరువాత వారాంతంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆపై మంగళవారం నాడు యూరోపియన్ నేతల ఒకరోజు సదస్సుకు కూడా పిలుపునిచ్చారు.

More Telugu News