: ఆఫర్ సరే, టికెట్లెక్కడ? స్పైస్ జెట్ బోగస్ ఆఫర్ పై మండిపడుతున్న ప్రయాణికులు

బుధవారం నాడు లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించిన రూ. 444 విమాన ప్రయాణ టికెట్ల ప్రకటన బోగస్ అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఆఫర్ లో భాగంగా కనీస టికెట్లను కూడా విక్రయించలేదని ఆరోపిస్తూ, ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు లేఖ రాసింది. ఈ తరహా తప్పుడు స్కీములను నిలిపివేయాలని ప్రకటించింది. కాగా, ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండే రూ. 444 టికెట్లను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు ప్రయాణించే వారు బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన రూట్లలో ఇవి లభ్యమవుతాయని స్పైస్ జెట్ వెల్లడించగా, టికెట్ల కోసం ప్రయత్నించిన వారికి అవి లభించలేదని ప్రయాణికులు మండి పడుతున్నారు. "నిన్న స్పైస్ జెట్ ప్రకటన వెలువడిన తరువాత ఉదయం 10:20 గంటల నుంచి మా సభ్యుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. తాము టికెట్లను పొందలేదని, 500 కి.మీ దూరంలోపు గమ్యస్థానాలకు సైతం స్పైస్ జెట్ టికెట్లను ఉంచలేదని తెలుస్తోంది" అని ఏపీఏఐ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డీ సుధాకర్ రెడ్డి విమర్శించారు. స్పైస్ జెట్ గిమ్మికులు చేసిందని ఆయన ఆరోపించారు.

More Telugu News