: ఉగ్రవాదులపై పోరుకు యుద్ధ విమానాలు, అణు ఒప్పందాలు ఎందుకు?: పాక్‌‌పై విరుచుకుపడిన ఆఫ్గనిస్థాన్

ఉగ్రవాదులను అణచివేసేందుకు ఎఫ్-16లు, అణు ఒప్పందాలు ఎందుకంటూ పాకిస్థాన్ తీరుపై ఆఫ్గనిస్థాన్ మండిపడింది. ఉగ్రవాదుల పీచమణచేందుకు ఎఫ్-16లు, అణు ఒప్పందాలు అవసరం లేదని.. నిజాయతీ, పోలీసు చర్యలతో వారి ఆటకట్టించవచ్చని ఐరాసలో ఆఫ్గనిస్థాన్ శాశ్వత ప్రతినిధి మహ్మద్ షైకల్ అన్నారు. బుధవారం సెక్యూరిటీ కౌన్సిల్ డిబేట్‌లో మాట్లాడిన ఆయన టోర్ఖామ్ వద్ద పాక్ తాజాగా నిర్మించిన బోర్డర్ పోస్టు అంశం గురించి ప్రస్తావించారు. అలాగే దేశ తూర్పు ప్రావిన్సులైన నంగర్‌హర్, ఖోస్ట్, పక్టికా, కునార్, నౌరిస్తాన్‌లో పాక్ 820 సార్లు ఫిరంగులు పేల్చిందని ఆయన పేర్కొన్నారు. ‘ఇకపై ఇటువంటి తప్పులు చేయొద్దు. బెదిరించే, రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దు’ అని పాక్‌ను హెచ్చరించారు. రెండు పొరుగు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం అవసరమని, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే పనులు చేయవద్దని షైకల్ కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఒక్కసారి విజయం సాధిస్తే ఆఫ్గనిస్థాన్‌ బలహీనతపై వస్తున్న అపవాదులకు పుల్‌స్టాప్ పడుతుందని షైకల్ అన్నారు. గత 15 ఏళ్లలో ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్, ముల్లా అక్తర్ మన్సూర్ వంటి ఎందరో తాలిబన్ నేతలు పాక్‌లో పుట్టి అక్కడే మరణించారని గుర్తుచేశారు. కరుడు గట్టిన తీవ్రవాదులందరూ అక్కడ ఉన్నట్టు రుజువై, అక్కడే చంపబడిన విషయాన్ని పాక్ గుర్తెరిగితే మంచిదన్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాక్.. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్న విషయం దీంతో స్పష్టంగా అర్థమవుతోందని షైకల్ అన్నారు.

More Telugu News