: ఆరు బ్యాంకుల్లో కలిసిపోనున్న 26 బ్యాంకులు!

దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేలా కీలక సంస్కరణలను మోదీ సర్కారు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆరు పెద్ద బ్యాంకుల్లో 26 చిన్న బ్యాంకులు విలీనం కానున్నాయి. బుధవారం నాడు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు చిన్న బ్యాంకులను తమలో విలీనం చేసుకోనున్నాయి. భారత చరిత్రలో ఇదే అతిపెద్ద బ్యాంకుల విలీనం. ఇక ఈ విలీనానికి ముందే సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యూకో బ్యాంకులు కెనరా బ్యాంక్ లో విలీనం కానుండగా, యూనియన్ బ్యాంక్ లో సెంట్రల్ బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం కానున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, విజయా బ్యాంకులు కలసిపోనున్నాయి. కాగా, తమ బ్యాంకు విలీనానికి సంబంధించిన సమాచారం ఏదీ రాలేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. విలీనం జరిగినప్పటికీ, వసూలు కాని రుణాల విషయంలో కలిగే లబ్ధి ఏమీ ఉండదని తెలిపారు. చిన్న బ్యాంకుల విలీనం ఆలోచన తొలి దశలోనే ఉందని, దీనికి సంబంధించిన పూర్తి విధానం ఖరారు కావాల్సి వుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News