: జింబాబ్వే రేప్ కేసులో అరెస్టయింది క్రికెటర్ కాదట!

జింబాబ్వేలో టీమిండియా రేప్ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయింది ఇండియన్ క్రికెటర్ కాదని, ఓ స్పాన్సర్ ఉద్యోగైన భారతీయుడని తెలిసింది. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు బసచేసిన హోటల్ లో ఓ వ్యక్తి తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయింది టీమిండియా క్రికెటర్ అంటూ జింబాబ్వే మీడియా ఊదరగొట్టింది. సోషల్ మీడియాలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. జింబాబ్వేలో భారత రాయబారి ఆర్.మసాకుయి ఈ వార్తలను ఖండించారు. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. ఇందులో భారత క్రికెటర్ ప్రమేయం లేదు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేశాం’’ అని ఆయన వివరించారు. అయితే ఈ కేసులో అరెస్టయిన భారతీయుడు కూడా రేప్ ఆరోపణలను ఖండిస్తున్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. క్రికెటర్ రేప్ ఆరోపణలను బీసీసీఐ కూడా ఖండించింది. క్రికెటర్లు కానీ, మ్యాచ్ అధికారులకు కానీ ఈ కేసులో ప్రమేయం లేదని పేర్కొంది.

More Telugu News