: 'ఎల్ఈడీ' విషయంలో భారత ప్రభుత్వానికి సాయపడుతున్న ఏడవ తరగతి ఎన్నారై బాలిక

మీరా వశిష్ట్... వయసు 13 సంవత్సరాలు. టెక్సాస్ పరిధిలోని సుగర్ ల్యాండ్ లో సర్తార్టియా మిడిల్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతోంది. ఇండియాలో విద్యుత్ ను ఆదా చేసేందుకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ఆలోచనను గురించి తెలుసుకున్న మీరా, తన వంతు సాయం చేయాలని భావించి నిధులను సమీకరించింది. ఏకంగా రూ. 1.4 లక్షలను సేకరించి వాటితో ఎల్ఈడీ బల్బులను కొనుగోలు చేసి వాటిని పేదలకు పంచాలని చెబుతూ, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) కు లేఖ రాసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు తెలిపింది. ఆమె సమీకరించిన డబ్బుతో 1600 ఎల్ఈడీ బల్బులను కొనుగోలు చేసి పేదలకు వచ్చే నెలలో పంచనున్నామని, ఆ కార్యక్రమానికి మీరా సైతం హాజరవుతుందని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ వెల్లడించారు. ఇండియాలో మొత్తం 11.7 కోట్ల ఎల్ఈడీ బల్బుల అవసరం ఉందని, మార్చి 2019 నాటికి సంప్రదాయ బల్బులను పూర్తిగా తొలగించి ఎల్ఈడీలను అమర్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ఆలోచనలను తెలుసుకున్న తాను, ఎలాగైనా సహాయపడాలన్న ఆలోచనతో నిధులను సమీకరించాలని భావించానని, మొత్తం 2,079 డాలర్లను సేకరించానని మీరా చెబుతోంది. ఢిల్లీకి వెళ్లి, ఎల్ఈడీలను పేదలకు పంచడంతో పాటు తన పూర్వీకుల గ్రామమైన పంజాబ్ లోని ఫగ్వారాను సందర్శిస్తానని మీరా సంబరంగా చెబుతోంది.

More Telugu News