: రాజన్ వెళ్లిపోతే రూపాయి, మార్కెట్ పాతాళానికేనా?

ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ తప్పుకుంటే రూపాయి మారకపు విలువకు, స్టాక్ మార్కెట్ కు తీవ్ర ఒడిదుడుకులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐకి రాజన్ దూరమైతే, భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, ఇది పానిక్ గా మారి, ఫారెక్స్, స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే వారంలో యూకేలో జరగనున్న బ్రెక్సిట్ రెఫరెండంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న భారత ఇన్వెస్టర్లపై రాజన్ రెండోసారి ఆర్బీఐ పదవిలో కొనసాగబోడని వస్తున్న వార్తలు సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయని గ్లోబల్ బ్రోకరేజి సంస్థ మెక్వయిర్ వెల్లడించింది. రాజన్ వెళ్లిపోతే, భారత మార్కెట్ తాత్కాలికంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. కాగా, 53 ఏళ్ల రాజన్ మూడేళ్ల ఆర్బీఐ గవర్నర్ పదవి సెప్టెంబరుతో ముగియనున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయనకు రెండో మారు అవకాశం లభిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, రాజన్ స్వయంగా తనకు ఇంకోసారి పదవి వద్దని, తాను అధ్యాపక వృత్తిలోకి వెళతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలావుడంగా రాజన్ పై భారత ఇన్వెస్టర్లతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆసియా పసిఫిక్ బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ వెల్లడించింది. ఆయన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలరని, పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ఇండియాను మార్చగలరని అత్యధికులు భావిస్తున్నారని సీఎల్ఎస్ఏ ప్రతినిధి క్రిస్టోఫర్ వూడ్ వ్యాఖ్యానించారు.

More Telugu News