: కేజీ నెయ్యి రూ. 10, పంచదార రూ. 2, కందిపప్పు రూ. 1.70..!... ఇది 1971 నాటి ధరల చీటీ!

నెలకు సరిపడా కూరగాయలు కొనుక్కుందామని వెయ్యి రూపాయలు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే...టమాటా 100 రూపాయలు, కేజీ పచ్చి మిర్చి 120 రూపాయలు, కేజీ కేరట్ 80 రూపాయలు, కేజీ కందిపప్పు 180, కేజీ మినపగుళ్లు 160... ఇలా ఉన్నాయి నేటి ధరలు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఇల్లు సర్దుతుండగా, తన తండ్రి బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా నెలకు సరిపడా ఇంటికి అవసరమైన పచారీ సామాన్ల ధరలతో కూడిన చీటీ ఒకటి బయటపడింది. ఈ చీటీ 19 మే 1971లో ఆ తండ్రి రాసుకున్నది. అందులో కందిపప్పు మూడు కేజీలు 5.10 రూపాయలు, పెసరపప్పు రెండు కేజీలు 3.40 రూపాయలు, మినపగుళ్లు 2 కేజీలు 3.60 రూపాయలు, శనగపప్పు కేజీ 1.25 రూపాయలు, ఆవాలు అరకేజీ రూపాయి. జీల కర్ర పావుకేజీ రూపాయి పావలా, మెంతులు పావు కేజీ అర్ధ రూపాయి, అరకేజీ మిరపకాయలు 2.75 రూపాయలు, ఇంగువ డబ్బా అర్ధరూపాయి. రెండు లైఫ్ బాయ్ సబ్బులు 1.40 రూపాయలు, 3 కేజీల నూనె 13.50 రూపాయలు, 2 కేజీల పంచదార 4.00 రూపాయలు, పావు కేజీ నెయ్యి 2.50 రూపాయలు. వెరసి ఆ కుటుంబానికి అవసరమైన ఒక నెల పచారీ సామాన్లకు అయిన ఖర్చు 40.75 రూపాయలు. దీంతో ఈ చీటీని ఫోటో తీసిన ఆ కుమారుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది వైరల్ అవుతోంది. ఈ ధరాభారం భరించడం తమ వల్ల కావడం లేదని, మళ్లీ ఆ నాటి రోజులకు వెళ్లిపోతే ఎంతో బావుంటుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అప్పట్లో జీతాలు తక్కువగానే ఉండేవి...దానికి తోడు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులుండేవారు. అయినా వారికి కష్టం తెలిసేది కాదని, ఇప్పుడు వేలు, లక్షల రూపాయల జీతాలు వస్తున్నా సరిపోవడం లేదని ఇంకొంతమంది నిట్టూరుస్తున్నారు.

More Telugu News