: వినాయకుడిపై వర్మ వివాదాస్పద ట్వీట్లు!... నోటీసులు జారీ చేసిన కోర్టు!

విఘ్న నాయకుడు వినాయకుడిపై బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 2014లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. నాడు వినాయక చవితిని పురస్కరించుకుని ట్విట్టర్ లో ప్రత్యక్షమైన ఆయన వినాయకుడిపై వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ‘‘వినాయకుడు ఆహారాన్ని చేతులతో తీసుకుని తింటాడా? లేక తొండంతోనా? గణేశుడికి బొజ్జ చిన్నప్పటి నుంచి ఉందా? లేక ఆపరేషన్ చేసి ఏనుగు తల తగిలించాక కోలుకునే సమయంలో పెరిగిందా? గణేశుడు ఇతర దేవతల కంటే ఎక్కువ తింటాడా? నాకీ సందేహం ఎందుకొచ్చిందంటే... మిగతా దేవతలంతా సన్నగా లేదా కండలు తిరిగి ఉంటారు..' అంటూ వరుస ట్వీట్లు చేసిన వర్మ... హిందువులను ఆగ్రహానికి గురి చేశారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఇండస్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆయనపై చర్యలు తీసుకోవాలని అంధేరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన కోర్టు... వర్మకు నోటీసులు జారీ చేసింది. సదరు ట్వీట్లకు జూలై 19 లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని న్యాయమూర్తి నిన్న ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ట్వీట్లు చేసిన వెంటనే జరిగిన తప్పు తెలుసుకున్న వర్మ... క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News