: భారత మార్కెట్ కు దూరంగా ఉండలేకపోయిన ఎఫ్ఐఐలు.. భారీ లాభాల్లో మార్కెట్లు

ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ఇండియాలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కు దూరంగా ఉండలేక పోయారు. గత రెండు మూడు సెషన్లుగా కొంత మేరకు అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ, దాన్ని మరచి మరీ భారీ ఎత్తున కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెషన్ ప్రారంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే లాభాల్లో నిలిచిన సూచికలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక్కసారిగా ముందుకు దూకాయి. సెన్సెక్స్ బుల్ నిమిషాల వ్యవధిలో 200 పాయింట్లకు పైగా హైజంప్ చేసింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 330.63 పాయింట్లు పెరిగి 1.25 శాతం లాభంతో 26,726.34 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 97.75 పాయింట్లు పెరిగి 1.21 శాతం లాభంతో 8,206.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.58 శాతం, స్మాల్ కాప్ 0.80 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 42 కంపెనీలు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్అండ్ టీ, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ఫ్రాటెల్, అరవిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి.

More Telugu News