: లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినందుకు ఖతార్ లో జైలుపాలైన విదేశీ టూరిస్టు

తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన ఓ డచ్ మహిళ, ఖతార్ లోని జైల్లో మూడు నెలల పాటు ఉండాల్సి రావడంతో పాటు 845 డాలర్ల జరిమానాను ఎదుర్కొంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహిళలపై ఆంక్షలు కఠినంగా ఉండే దోహాకు, డచ్ నుంచి 22 ఏళ్ల మహిళా టూరిస్టు లౌరా, తన స్నేహితుడితో కలసి వచ్చింది. దేశంలో మద్యం సేవించేందుకు అవకాశాన్ని ఇచ్చే అతి కొద్ది ప్లేసుల్లో ఒకటైన దోహా హోటల్ క్రిస్టల్ లాంజ్ లో పార్టీకి వెళ్లింది. "మద్యం సేవించి, ఆపై తలతిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడం వరకే ఆమెకు గుర్తు. ఆపై మెలకువ వచ్చి చూసేసరికి ఓ కొత్త అపార్టుమెంటులో ఉంది. ఆమె దుస్తులు చిరిగిపోయాయి. తాను అత్యాచారం చేయబడ్డానని లౌరా గమనించింది" అని ఆమె తరఫు న్యాయవాది తెలియజేశాడు. మొత్తం వాదనలు విన్న ఖతార్, ఓ మహిళ తన భర్తతో కాకుండా మరో మగాడితో శారీరకంగా కలిసిందని ఆరోపిస్తూ, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆదేశించింది. రేప్ జరిగిందని ఫిర్యాదు చేసినందుకు 845 డాలర్ల జరిమానాగా విధించింది. డచ్ దౌత్యాధికారులు కల్పించుకుని ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమెను విడిపించడానికి మూడు నెలలు పట్టింది. ఖతారీ కోర్టు ఆమె శిక్షను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ, తక్షణమే దేశం వదిలి వెళ్లాలని తీర్పివ్వగా, బతుకుజీవుడా అనుకుంటూ లౌరా తన దేశానికి పయనమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టేందుకు సమ్మతించని న్యాయస్థానం, అనైతికంగా ప్రవర్తించి, మద్యం సేవించినందుకు అతనికి 140 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది.

More Telugu News