: మోదీ కీలక రాయబారం... పుతిన్ కు ఫోన్, జిన్ పింగ్ తో త్వరలో భేటీ

అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక రాయబారాన్ని నడుపుతున్నారు. 42 దేశాలున్న ఈ కూటమిలో ఇపటికే మెజారిటీ సభ్య దేశాల మద్దతు కూడగట్టిన మోదీ... తాజాగా రష్యా మద్దతును కూడా సంపాదించారు. ఇక మిగిలింది చైనా మద్దతు మాత్రమే. మొన్నటి వియన్నాలో జరిగిన ఎన్ఎస్జీ కూటమి భేటీలో భారత్ కు సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా నిరసన గళం వినిపించింది. చైనా వాదనకు పలు దేశాలు కూడా మద్దతు పలకడంతో భారత సభ్యత్వ దరఖాస్తుపై చర్చ సీయోల్ జరిగే భేటీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరింత మద్దతు కూడగట్టేందుకు రంగంలోకి దిగిన మోదీ... శనివారం నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్నారు. అదే అదనుగా మోదీ... ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై ప్రస్తావన తీసుకొచ్చారట. కీలక మిత్ర దేశంగా ఉన్న భారత్ కు పుతిన్ కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇక చైనా మద్దతు కూడగట్టేందుకు కూడా మోదీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సీయోల్ లో ఎన్ఎస్జీ భేటీకి ముందుగానే తాష్కెంట్ లో జరిగే ఎస్సీఓ సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీకి మోదీ సిద్ధమయ్యారు. ఇప్పటికే నిరసన గళాన్ని కాస్తంత తగ్గించిన చైనా... తాష్కెంట్ భేటీ సందర్భంగా మోదీకి జిన్ పింగ్ సంపూర్ణ మద్దతు పలకడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News