: ఆస్తుల అటాచ్ పై మాల్యా క్విక్ రియాక్షన్... రుణమెలా చెల్లించాలని ఈడీపై ఆగ్రహం

బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరగకుండానే తనను దోషిగా చూపేందుకు ఈడీ యత్నిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐడీబీఐ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన నిధులను మాల్యా అక్రమ పద్ధతుల్లో విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ... మొన్న మాల్యా, ఆయన సంస్థ యూబీ గ్రూప్ నకు చెందిన రూ.1,411 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ మెంట్ చేసింది. దీనిపై వేగంగా స్పందించిన మాల్యా... నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. ఈడీ తనపై పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని, కోర్టులో కేసు విచారణ జరగకముందే తనను దోషిగా చూపేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయినా ఆస్తులను అటాచ్ చేస్తే బ్యాంకులకు, ఉద్యోగులకు బకాయిలు ఎలా చెల్లించాలని కూడా మాల్యా ప్రశ్నించారు. పూర్తిగా సివిల్ వివాదాలుగా ఉన్న కేసుల్లో క్రిమినల్ అభియోగాలు ఎలా నమోదు చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్ పోర్టు రద్దుతో పాటు ‘ప్రొక్లెయి డ్ అబ్ స్కాండర్’ గా తనను ప్రకటించేందుకు జరుగుతున్న యత్నాలను కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ దర్యాప్తునకు తాను హాజరుకాబోనని ఏనాడు చెప్పలేదన్న మాల్యా... హాజరయ్యేందుకు సమయం కావాలని కోరానని తెలిపారు. ముందుగా ఖరారైన విదేశీ పర్యటనకు తాను మార్చి 2న జెనీవాకు వచ్చానని, ఆ సమయంలోనే తనపై కేసులు నమోదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన క్రమంలో ఇప్పుడప్పుడే దేశానికి తిరిగిరాలేనని కోర్టులకు తెలిపానని ఆయన పేర్కొన్నారు.

More Telugu News