: సత్తా చాటిన ఫ్రాన్స్... యూరో-2016 తొలి ఫైట్ లో ఆతిథ్య దేశానిదే పైచేయి

ప్రపంచ ఫుట్ బాల్ సంగ్రామం ‘యూరోపియన్ ఛాంపియన్ షిప్’లో తొలి ఫైట్ ఆసక్తికరంగా సాగింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య దేశం రొమేనియాతో తలపడింది. ఫుట్ బాల్ లో మేటిజట్టుగా ఎదిగిన ఫ్రాన్స్ ఈ మ్యాచ్ లో సత్తా చాటింది. 2-1 స్కోరుతో రొమేనియాను మట్టి కరిపించింది. తొలుత రొమేనియా నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో 58వ నిమిషంలో ఫ్రాన్స్ తొలి గోల్ చేసింది. అయితే ఫ్రాన్స్ కు దీటుగా కదిలిన రొమేనియా కూడా మరో 7 నిమిషాలు గడిచేలోగానే ఓ గోల్ కొట్టింది. ఈ క్రమంలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందా? అన్న భావన కలిగింది. అయితే ఫ్రాన్స్ స్టార్ దిమిత్రి పాయెట్ 89వ నిమిషంలో మెరుపులా కదిలి మరో గోల్ కొట్టడంతో రొమేనియాకు ఓటమి తప్పలేదు. వెరసి ఫుట్ బాల్ సంరంభం ఆరంభ మ్యాచ్ లోనే ఆతిథ్య దేశంగా ఫ్రాన్స్ బోణీ కొట్టి సత్తా చాటింది.

More Telugu News