: ట్రంప్ 'భారతీయ యాస' విమర్శలకు గట్టి సమాధానమిచ్చిన మోదీ!

లోకల్ నినాదంతో విదేశీయులపై అక్కసు వెళ్లగక్కడమే లక్ష్యంగా అధ్యక్ష పదవిని పొందుదామని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన 'భారతీయ యాస' వ్యాఖ్యలకు మోదీ గట్టి సమాధానమిచ్చారు. గతంలో ట్రంప్ ఓ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, మన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోతున్నారని అన్నారు. ఓసారి తాను క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయగా, తన సమస్యను వివరిద్దామని ప్రయత్నించానని, అప్పుడు అటునుంచి అమెరికన్ యాస వినపడలేదని, దీంతో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని ప్రశ్నించానని, అవతలి వ్యక్తి భారత్ నుంచి అని సమాధానమిచ్చాడని, తాను అద్భుతం అని ఫోన్ పెట్టేశానని అన్నారు. దీనిని నేరుగా ప్రస్తావించని మోదీ...యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగం సందర్భంగా భారతీయులు అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వ్యాపారులు, విద్యావేత్తలు, వ్యోమగాములు, అధ్యాపకులు, వైద్యులుగా వివిధ రంగాల్లో అమెరికాకు సేవలు చేస్తున్నారని అన్నారు. అలాగే అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'స్పెల్ బీ' పోటీల్లో భారత సంతతి పిల్లలే గత కొన్నేళ్లుగా విజయం సాధిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 2010 నుంచి వరుసగా స్పెల్ బీ కాంపిటీషన్ లో భారతీయ సంతతి విద్యార్థులే విజయం సాధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇది ప్రస్తావించడం ద్వారా భారతీయులు ఆంగ్ల సంభాషణలో ప్రావీణ్యులని చెప్పకనే చెప్పారు.

More Telugu News